3°C గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వృద్ధులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరితే భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోని వృద్ధులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వరుసగా మూడు నెలల వరకు ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని The Lancet Planetary Healthలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని వృద్ధ జనాభాలో సుమారు 73 శాతం ఈ నాలుగు దేశాల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3°C పెరిగితే భారత్‌లో సగానికి పైగా జనాభా, 80 శాతానికి పైగా వృద్ధులు ఏడాదిలో కనీసం 180 గంటల పాటు శరీరానికి భరించలేని వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది. ప్రస్తుతం 1.5°C గ్లోబల్ వార్మింగ్ దిశగా ప్రపంచం సాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, విస్తృత ఇండో-గంగేటిక్ మైదాన ప్రాంతాల్లోని వృద్ధులు ఏడాదికి దాదాపు 1,000 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 3°C ఉష్ణోగ్రత పెరుగుదల చోటుచేసుకుంటే ఈ సమయం 2,000 గంటలకు పైగా పెరగవచ్చని అంచనా. ఈ తీవ్రమైన వేడి ఏడాది మొత్తం సమానంగా ఉండదని, ప్రధానంగా మే నుంచి సెప్టెంబర్ మధ్య కేంద్రీకృతమవుతుందని అధ్యయన ప్రధాన రచయిత ప్రొఫెసర్ క్విన్‌కిన్ కాంగ్ తెలిపారు.
పగలు, రాత్రి వేడి.. వృద్ధులకు కోలుకునే అవకాశం కూడా కష్టం
3°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుదల సంభవిస్తే వృద్ధులు వరుసగా అనేక నెలల పాటు పగలు, రాత్రి రెండింటిలోనూ భరించలేని వేడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోతే శరీరానికి వేడి నుంచి కోలుకునే అవకాశం తగ్గిపోతుంది. దీంతో శీతలీకరణ సదుపాయాలు, విద్యుత్, వైద్య సేవలు, హీట్-రెస్పాన్స్ కార్యక్రమాలపై భారీ ఒత్తిడి పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధులకే ఎందుకు ఎక్కువ ముప్పు?
వయసు పెరిగే కొద్దీ శరీరం వేడిని నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. వృద్ధులు తక్కువగా చెమట పడతారు. రక్తనాళాల స్పందన మందగిస్తుంది. వేడి పరిస్థితుల్లో గుండెపై కూడా ఎక్కువ భారం పడుతుంది. ఇప్పటివరకు వేడి తట్టుకునే శరీర సామర్థ్యంపై నిర్వహించిన అనేక అధ్యయనాలు ఆరోగ్యవంతులైన యువకుల డేటాపైనే ఎక్కువగా ఆధారపడ్డాయని పరిశోధకులు తెలిపారు. దీంతో వృద్ధులకు ఉన్న ప్రమాదాన్ని గతంలో కనీసం రెండు రెట్లు తక్కువగా అంచనా వేసి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్-గాంధీనగర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్ గోలెచ్చా మాట్లాడుతూ.. అందరికీ ప్రమాదకరంగా మారే ఒకే ఉష్ణోగ్రత పరిమితి ఉండదని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందన్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరం వేడిని నియంత్రించే సామర్థ్యం తగ్గుతుందని, యువకులతో పోలిస్తే వృద్ధులు తక్కువ ఉష్ణోగ్రత, తేమ స్థాయిల్లోనే అధిక శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ 1.5°C వద్దే ప్రపంచంలోని వృద్ధుల్లో సుమారు 22 శాతం మంది.. అంటే దాదాపు 29 కోట్ల మంది.. ఏడాదిలో కనీసం ఒక నెలపాటు ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది.
అధ్యయనంలో ‘ప్రమాదకరమైన వేడి’గా పరిగణించిన పరిస్థితి అంటే ఏడాదిలో కనీసం 180 గంటల పాటు శరీరం వేడిని సమతుల్యం చేసుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రత, తేమ ఉండటం. రోజుకు సుమారు ఆరు గంటల చొప్పున ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అధ్యయనం లెక్కించింది. యువకులకు ఇదే స్థాయి ప్రమాదం 4°C గ్లోబల్ వార్మింగ్ వద్ద మాత్రమే గణనీయంగా కనిపిస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 49 కోట్ల మంది యువకులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రత ప్రతి అదనపు 1°C పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత-తేమ కలయిక శరీరం వేడిని సమతుల్యం చేసుకోలేని స్థాయికి చేరే పరిస్థితిని ఎదుర్కొనే ప్రజల సంఖ్య సుమారు 100 కోట్ల మేర పెరగవచ్చని అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో పేర్కొన్న ‘ఇన్‌టాలరబుల్ హీట్’ అంటే వెంటనే ప్రాణాపాయం ఏర్పడే ఉష్ణోగ్రత అని అర్థం కాదని ప్రొఫెసర్ కాంగ్ స్పష్టం చేశారు. చాలా తేలికపాటి పని, ఉదాహరణకు డెస్క్ వద్ద కూర్చొని పనిచేసే సమయంలో కూడా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోలేని స్థాయిని ఈ పరిమితిగా అధ్యయనం పరిగణించింది. ఈ స్థాయిని దాటిన తర్వాత శరీరం నిరంతరం వేడిని పొందుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అది చివరకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.




