అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అడవుల్లో జీవించిన మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇప్పుడు ప్రధాన స్రవంతి జీవితానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతగా, ఆ పార్టీ సాయుధ విభాగమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)కు ఒకప్పుడు నాయకత్వం వహించిన తిరుపతి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయి ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్లలో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉదయం కొద్దిసేపు వాకింగ్ చేయడం, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేయడం, పత్రికలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆయన దినచర్యగా మారింది..

తిరుపతి ఇటీవల తన చదువును కూడా కొనసాగించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షను రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత లా చదవాలనే ఉద్దేశంతో LAWCET పరీక్షకు హాజరై 349వ ర్యాంకు సాధించారు. దీంతో ఎల్‌బీనగర్‌లోని పురాతన న్యాయ కళాశాలల్లో ఒకటైన కళాశాలలో LLB కోర్సులో ప్రవేశం పొందారు. తాను కేవలం రెండు రోజులు మాత్రమే పరీక్షకు సిద్ధమయ్యానని, అయినప్పటికీ 349వ ర్యాంకు వచ్చిందని తిరుపతి తెలిపారు. మరికొంత సమయం కేటాయించి ఉంటే ఇంకా మెరుగైన ర్యాంకు సాధించి ఉండేవాడినని నవ్వుతూ చెప్పారు.
1983లో పరీక్ష హాల్ నుంచి అడవుల వైపు..
తిరుపతి జీవితం 1983లో కీలక మలుపు తిరిగింది. అప్పట్లో ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) అధ్యక్షుడిగా ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి పోలీసులు వచ్చి RSU సభ్యులను భయపెట్టేవారని ఆయన తెలిపారు. ఒకసారి పోలీసులు మళ్లీ పరీక్ష హాల్లోకి వస్తే పరీక్షను బహిష్కరించాలని సుమారు 10 మంది విద్యార్థులు నిర్ణయించుకున్నారు. తెలుగు పరీక్ష రోజు పోలీసులు పరీక్షా కేంద్రంలోకి వచ్చారు. తనతో పాటు స్నేహితులు కూడా బయటకు వస్తారని తిరుపతి భావించారు. అయితే చివరి సమయంలో మిగతా విద్యార్థులు వెనక్కి తగ్గారు. దీంతో తిరుపతి ఒక్కడే నినాదాలు చేస్తూ పరీక్ష పత్రాలను అక్కడే వదిలి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1983 చివర్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దళం సభ్యుడిగా తన అండర్‌గ్రౌండ్ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఏరియా కమాండర్, డివిజనల్ కమాండర్ వంటి స్థాయిలకు ఎదిగారు. వ్యూహాత్మక నైపుణ్యంతో సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కీలక స్థానాలకు చేరుకున్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించినట్లు భద్రతా వర్గాలు పేర్కొంటాయి.
దంతెవాడ దాడితో సహా కీలక ఘటనల్లో పాత్ర
మావోయిస్టు ఉద్యమంలో తిరుపతి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన, వ్యూహాత్మకంగా ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. 2007లో జరిగిన ‘యూనిటీ కాంగ్రెస్’, ఛత్తీస్‌గఢ్‌లోని గీడం పోలీస్ స్టేషన్‌పై దాడి వంటి పలు కీలక ఘటనల్లో ఆయన పాత్ర ఉందని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. 2010 ఏప్రిల్‌లో దంతెవాడలో జరిగిన ఘోర దాడిలో 76 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడికి తిరుపతినే ప్రధాన వ్యూహకర్తగా భద్రతా బలగాలు పరిగణించాయి.
ప్రస్తుతం చట్టబద్ధమైన వ్యవస్థలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నందున న్యాయశాస్త్రం చదవాలని భావించినట్లు తిరుపతి తెలిపారు. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన భూమి హక్కులు, చట్టపరమైన హక్కులపై మరింత అవగాహన పెంచుకోవడానికి LLB చదువు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు అడవుల్లో గడిపిన తిరుపతి.. ఇప్పుడు పుస్తకాలు చదువుతూ, పరీక్షలు రాస్తూ, లా విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు తుపాకీ పట్టిన చేతులు ఇప్పుడు పుస్తకాలు పట్టడం ఆయన జీవితంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది.




