Hassan: కర్నాటక హసన్ జిల్లాకు గుండెపోటు…! ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్న జనం
లేపాక్షి అనే 30 ఏళ్ల హోమ్ మేకర్ ఇంట్లో వంట చేసుకుంటూ కుప్పకూలిపోయింది.. 58 ఏళ్ల ఇంగ్లీష్ లెక్చరర్ క్యాంటీన్‌లో టీ తాగుతూ సడన్‌గా కొలాప్స్ అయ్యాడు. ఛాతీనొప్పి రావడంతో టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై తిరిగొచ్చాడు చెన్నరాయ అనే ప్రభుత్వోద్యోగి. 63 ఏళ్ల ఆటో డ్రైవర్ తానే ఆటో నడుపుకుంటూ ఆస్పత్రికి వెళ్లి మార్చురీలో తేలాడు. అన్నీ ఒక్క హసన్ జిల్లాలోనే, కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే నమోదైన కేసులు. కర్నాటకలోని హసన్ జిల్లాకు ఏమైంది.. ఎందుకీ వరస ఆకస్మిక మరణాలు..?

20 ఏళ్ల సంధ్య, 19ఏళ్ల అభిషేక్, 43 ఏళ్ల దేవరాజ్, 58 ఏళ్ల నీలకంఠప్ప.. ఒక కాలేజ్ లెక్చరర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక మహిళ, ఒక ఆటో డ్రైవర్.. యువకుల్లేదు, వృద్ధులే కాదు.. వయసుతో ప్రమేయం లేకుండా జరుగుతున్న ఆకస్మిక మరణాలు… అన్నీ గుండెపోటు కేసులే. కర్నాటక హసన్ జిల్లా మొత్తాన్నీ కలవరపెడుతున్నాయిప్పుడు.
మే20తో మొదలైంది.. ఈ మృత్యు ఘంటికలు ఇప్పటికీ ఆగలేదు. కేవలం నెల రోజుల గ్యాప్‌లోనే 22 మంది గుండెపోటుతో చనిపోయారు. 20 ఏళ్లలోపు యువతీయువకులు నలుగురు, 40 ఏళ్లలోపువారు నలుగురు, 50 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు నలుగురు.. గుండె కొట్టుకోవడం ఆగి ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. జూన్ 30న ఒక్క రోజే నలుగురు చనిపోయారు. అసలేమైందో తెలీక వైద్యఆరోగ్యశాఖ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మృతుల కుటుంబీకులదైతే అంతులేని ఆవేదన.
హసన్ జిల్లాకు గుండెపోటు అంటూ ఇదొక నేషనల్ బ్రేకింగ్ న్యూసైంది. దేశమంతా అటువైపే ఆసక్తిగా, ఆందోళనగా చూస్తోంది. అక్కడి ఊర్లలో జనం మాత్రం క్షణమొక యుగంలా భయంభయంగా బతుకుతున్నారు. సమస్య తీవ్రతను గమనించి.. ఆరోగ్య శాఖ, హిమ్స్ వైద్య నిపుణులతో సమీక్ష జరిపి… మృతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ ఐదుగురు స్పెషలిస్టులతో డా.రవీంద్రనాథ్ నేతృత్వంలో కమిటీ వేసింది ప్రభుత్వం.
హసన్ జిల్లా హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం.. ఆ ఒక్క ఊర్లోనే గత రెండేళ్లలో 507 గుండెపోటు కేసులు నమోదైతే.. వాళ్లలో 190 మంది మృత్యువాతన పడ్డారు. అటు… వైద్యఆరోగ్య శాఖ మొద్దునిద్దరపై కూడా విమర్శలొస్తున్నాయి. హసన్ జిల్లాలో 50 కోట్ల ఖర్చుతో నిర్మించిన జయదేవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మూడేళ్లుగా మూతబడే ఉంది.
మారుతున్న లైఫ్‌స్టయిల్, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, వికృతమైన ఆహారపుటలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం.. ఇవి కూడా గుండెపోటుకు కారణాలంటూ డాక్టర్లు చెప్పే రొటీన్ మాటలు ఉండనే ఉన్నాయి. ఛాతినొప్పిని, అలసటను నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలనే సూచనలూ సరేసరి. కానీ.. వీటన్నిటికీ అతీతంగా హసన్ గుండెపోటుకు మరేదైనా మూలకారణం ఉందా అనేది అంతుబట్టని సందేహం.
గతంలో వేసుకున్న కరోనా టీకాలే ఈ ఆకస్మిక మరణాలకు కారణమా? అనే ప్రచారం కూడా లేకపోలేదు. కానీ.. యువత ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని ఇటీవలే తేల్చిచెప్పింది కేంద్రం. అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవనశైలి, జన్యుపరమైన సమస్యల్నే ప్రస్తావించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ కూడా ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేశాయి. గుండెకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ గుండెపోటుకు దారితీస్తోందని చెబుతోంది. అంతేతప్ప కొవిడ్ వ్యాక్సిన్లే కారణమనేది తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది.
కానీ.. కర్నాటక సర్కార్ వైఖరి మాత్రం మరోలా ఉంది. కొవిడ్ వ్యాక్సిన్లకు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన తొందరపాటు అనుమతులు.. టీకాల విచ్చలవిడి వాడకం.. వాటితో వచ్చిన సైడ్‌ఎఫెక్ట్స్ కూడా హసన్ జిల్లావాసుల గుండెపోట్లకు దారితీసి ఉండొచ్చు.. అంటూ సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కొత్త చర్చకు తావిస్తోంది. ఒకవైపు ఆకస్మిక మరణాలపై దర్యాప్తు కోసం కమిటీని వేస్తూనే.. మరోవైపు కొవిడ్‌ని కారణంగా చూపడం చర్చనీయాంశంగా మారింది. అటు తర్వాతి వంతు ఎవరిది అనే టెన్షన్‌తో బిక్కచచ్చిపోతున్నారు హసన్ జిల్లాలో జనం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




