Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 Elections: కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష.. సవాళ్లతో స్వాగతం.. తలనొప్పిగా మారనున్న సీట్ల పంపకం!

Congress Party - 2024 Election: కొత్త సంవత్సరం కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్న వేళ, దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఆ పార్టీకి ఉత్తేజం కలిగించినా.. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకోవడం, మధ్యప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిస్థితుల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి.

2024 Elections: కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష.. సవాళ్లతో స్వాగతం.. తలనొప్పిగా మారనున్న సీట్ల పంపకం!
Congress Party
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 03, 2024 | 9:59 AM

Congress Party – 2024 Election: కొత్త సంవత్సరం కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్న వేళ, దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఆ పార్టీకి ఉత్తేజం కలిగించినా.. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకోవడం, మధ్యప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిస్థితుల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు గుజరాత్‌లో తిరుగులేని శక్తిగా మారిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిలువరించేందుకు ఒంటరి పోరాటం సరిపోదని భావించిన కాంగ్రెస్, సుమారు 30 రాజకీయ పార్టీలతో ఓ గ్రాండ్ అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ – I.N.D.I.A) ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ప్రత్యర్థి బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే ఇండియా కూటమిలో మిత్రపక్షాల నుంచే ఎక్కువగా ఎదురవుతున్నాయి. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించడమే కాదు, మూడు సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలన్న ప్రయత్నాల్లో కమలనాథులు ఉంటే.. కూటమిలో ఇంటి పోరుతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ముఖ్యంగా సీట్ల పంపకం, సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల్లోని శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీలు ఉద్రిక్తత సృష్టిస్తున్నాయి.

కూటమి పొత్తులు కొన్ని రాష్ట్రాలకే పరిమితం!

విపక్ష కూటమి (I.N.D.I.A)లో సీట్ల పంపకంపై చర్చించే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నాయకత్వంతో సమావేశాలు, సంప్రదింపులు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా కూటమి పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 300 సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పోటీ చేయాలని, మిగతా స్థానాలను కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. లేనిపక్షంలో కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడం కష్టతరమవడమే కాదు, ఒకవేళ గెలుపొందితే ప్రధాని పదవిని దక్కించుకోవడం కూడా కష్టంగా మారుతుందని లెక్కలు వేసుకుంటోంది. పార్టీ సొంతంగా బలంగా ఉన్న చోట కూటమిలోని మిత్రపక్షాలకు చోటిచ్చి చేటు కొనితెచ్చుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశంలోని 10 రాష్ట్రాల్లో ఒంటరిగా, మరో 9 రాష్ట్రాల్లో కూటమిగా జట్టుకట్టి పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. గుజరాత్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసేందుకు వ్యూహం రచించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్రలో కూటమి సాయంతో పోటీ చేయాలని నిర్ణయించింది. కూటమిగా ఏర్పడ్డ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే పాక్షికంగా కూటమి పొత్తు సూత్రం అమలైంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కు ఒక్క సీటు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఐ (ఎం)తో ఏకాభిప్రాయం కుదరక పొత్తు సాధ్యపడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదు. అయితే మిత్రపక్షాలు పోటీలో లేకుండా చూసుకుంటే చాలు.

సీట్ల పంపకమే అసలైన సవాలు

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల పంపకంపై దృష్టి సారించింది. సీట్ల సర్దుబాటుపై రాష్ట్రాల స్థాయిలోనే నిర్ణయం జరగాలని భావిస్తోంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే.. ఆ పార్టీ సీట్ల పంపకానికి నేతృత్వం వహిస్తుందని విపక్ష కూటమి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. “మేము సీట్లు కోరే పరిస్థితిలో లేము.. ఇచ్చే స్థాయి మాది” అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చర్చనీయాంశం. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో పొత్తు – సీట్ల సర్దుబాటు పీఠముడిగా మారే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు అవసరం లేదని పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వమే కాదు, కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు. ఇదే తరహాలో కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య వైరం ఉంది. అదేమాదిరిగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు మధ్య తీవ్ర వైరం నెలకొని ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాల సఖ్యత లేదు. తాజాగా బిహార్‌లో జేడీ(యూ), ఆర్జేడీ మధ్య చిచ్చు మొదలైంది. ఇలాంటి స్థితిలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం అతి పెద్ద సవాలుగా మారనుంది.