పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా పరుగో పరుగు!
సాధరణంగా పంట పొలాల్లో కప్పలు, ఎలుకల కోసం పాములు సంచరిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం కొందరు తమ పొలాలకు వెళ్లగా అక్కడ భారీ సైజులో కనిపించినది చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది ఏకంగా 19 అడుగుల పొడవున్న భారీ అనకొండ.. దీంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
రాయగడ పట్టణం, డిసెంబర్ 23: ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్ ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో 19 అడుగుల పొడవున్న భారీ అనకొండను చూసిన స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నారాయణ్‌పూర్ గ్రామం పరిధిలోని పొలంలో భారీ కొండచిలువను శనివారం (డిసెంబర్ 21) సురక్షితంగా రక్షించగలిగారు.
అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను పట్టుకుని బోనులో బంధించారు. దాని తల భాగంలో స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స అందించిన అనంతరం అడవిలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటవీ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రక్షించబడిన అతిపెద్ద కొండచిలువ ఇదే. సాధారణంగా కొండచిలువలు మనుషులకు ప్రమాదకరమైనవిగా పరిగణించబడవు. కానీ వాటి పరిమాణాన్ని బట్టి ఎవరైనా రెచ్చగొడితే చంపడానికి వెనకాడవు. అయితే, కొండచిలువలు సాధారణంగా ఆత్మరక్షణ కోసం తప్ప మనుషులపై దాడి చేయవని అటవీ అధికారులు తెలిపారు.
కాగా డిసెంబర్ 3న కూడా ఒడిశాలోని అంగుల్ జిల్లాలో 15 అడుగుల పొడవున్న కొండచిలువ పామును అటవీ అధికారులు రక్షించారు. పురునగర్ బడాదండ సాహి గ్రామ రహదారిలో భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువ బడాదంద్ సాహి గ్రామ రహదారిని దాటుతుండగా కొంతమంది స్థానికులు దానిని చూశారు. దీంతో వారు భయపడి చంపేందుకు ప్రయత్నించారు. అయితే, అదృష్టవశాత్తూ స్నేక్ హెల్ప్ లైన్ సభ్యుడు బిశ్వరంజన్ బెహెరా ఆ మార్గంలో అంగుల్ నుంచి వస్తుండగా, పామును చంపడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను చూశాడు. అతను జోక్యం చేసుకుని కొండచిలువను రక్షించడంతో కథసుఖాంతమైంది.