Anti-Covid-19 Oral Drug: కరోనాపై పోరులో మరో అస్త్రం నేడు అందుబాటులోకి రానుంది. యాంటీ-కోవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్‌లో భాగంగా 10వేల ప్యాకెట్లను ఈ రోజు విడుదల చేయనున్నారు. కరోనాపై పోరులో కీలకంగా పనిచేసే ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేసేందుకు ఈ ఔషధం ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఫస్ట్ బ్యాచ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు. దేశ రాజధానిలోని పలు ఆసుపత్రుల్లో 10,000 సాచెట్లను పంపిణీ చేయనున్నారు.
డీఆర్డీవో తయారు చేసిన 2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఔషధం కొద్ది నుంచి ఓ మోస్తరు కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులపై బాగా పని చేసింది. ఒకవైపు చికిత్స అందిస్తూనే అదనంగా ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకునే అవకాశాలున్నాయని.. పరిశోధనలో వెల్లడైంది. అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలినిచ్చిందని, ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్‌డీఓ వెల్లడించిది. ఈ డ్రగ్ పొడి రూపంలో సాచెట్లలో లభిస్తుంది. ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం వలన వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్‌డీఓ 2020 ఏప్రిల్‌లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఫస్ట్ వేవ్ సమయంలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాలు నిర్వహించారు.డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీఓ ల్యాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ 2-డజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
Also Read: