Yoga vs Gym: యోగా vs జిమ్? మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!

రోజంతా ఎంత బిజీగా ఉన్నా , ప్రతి రోజూ ఒక అరగంట సమయం- వ్యాయామం కోసం వెచ్చించాలని అందరూ అనుకుంటారు. కానీ ఇంతకీ వ్యాయామం అంటే ఏంటి? యోగానా? ఏరోబిక్సా? లేదా జిమ్‌కు వెళ్లడమా? వీటిలో ఏది ఎవరికి సూట్ అవుతుంది? స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Yoga vs Gym: యోగా vs జిమ్? మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!
Yoga Vs Gym

Updated on: Oct 24, 2025 | 6:20 PM

వ్యాయామం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని అందరికీ తెలుసు కానీ ఎలాంటి మేలు? అనేది కూడా తెలుసుకోవాలి. వ్యాయామం చేసే వాళ్లలో  కొందరికి  మానసిక ప్రశాంతతముఖ్యం, మరికొందరికి బాడీ ఫ్లెక్సిబిలిటీ  ముఖ్యం, ఇంకొంత మందికి కండలు తిరగడం ముఖ్యం.  అయితే ఏది కోరుకునే వాళ్లు  ఆయా ప్రయోజనాలు చేకూర్చే  వ్యాయామాలు చేయాలి. ఉదాహరణకు  మానసిక ప్రశాంతత కోసం జిమ్‌కు వెళ్లి ఉపయోగం లేదు. అలాగే కండలు పెంచడం కోసం యోగా చేసి ప్రయోజనం లేదు. అందుకే  ఎవరెవరికి ఏయే వ్యాయామాలు సూట్ అవుతాయో తెలుసుకుని వాటినే చేయాలి. అవేంటో చూద్దాం.

మానసిక ఆరోగ్యం కోసం..

వ్యాయామానికీ, మానసిక ఉత్సాహానికీ మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి.   మానసిక ఉత్తేజాన్ని కోరుకునే వాళ్లు ఇతర వ్యాయామలకు బదులు  యోగాను ఎంచుకోవడం ఉత్తమం. యోగా చెయ్యటం వల్ల మానసిక ఉత్తేజాన్నిచ్చే సెరటోనిన్‌ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ ఒత్తిడిని తుడిచేస్తుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా చూస్తుంది.  ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామన్న భావనను ప్రేరేపిస్తుంది.

యాక్టివ్ గా ఉండాలంటే..

చిన్నపిల్లలు చాలా చలాకీగా కదులుతుంటారు. అందుకు వారి శరీరం అద్భుతంగా సహకరిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ  శారీరక కదలికలు తగ్గుతుంటాయి. సహజంగానే వ్యవస్థలన్నీ బలహీనపడుతూ, శరీరాన్ని క్షీణింపజేస్తాయి. అయితే నిత్యం జిమ్, ఏరోబిక్స్, యోగా, స్విమ్మింగ్ చేసే వారిలో ఈ క్షీణత చాలా తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పెద్దవయసులో కూడా రోజూ ఇవి చేయడం ద్వారా-పిల్లలతో పోటీ పడొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటే యోగా లేదా ఏరోబిక్స్ చేయొచ్చు. యాక్టివ్ గా ఉంటూనే కండలు తిరిగిన దేహం కావాలంటే జిమ్ చేయొచ్చు.

నిద్ర కోసం

నిద్ర కోసం ఏరోబిక్స్ బెస్ట్. రోజూ ఏరోబిక్‌ వ్యాయామాలు చేసేవారిలో నిద్రకు సంబంధించి చాలా  ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఏరోబిక్ వ్యాయామం చేస్తే  తేలికగా నిద్రపడుతుంది. నిద్రలో కూడా  ఎక్కువ సమయం గాఢ నిద్రలో గడుపుతారు. ఏరోబిక్స్ వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ గా మారి రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా నిద్ర సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గడానికి

ఇక అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు నడక, సైక్లింగ్, ట్రెడ్ మిల్ వంటి కార్డియో వ్యాయామాన్ని ఎక్కువగా ఎంచుకోవాలి.  అంతే కాకుండా మధుమేహం, హైబీపీ,  కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటి సమస్యలున్న వాళ్లు రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలి. అలాంటి వాళ్లకు కూడా జాగింగ్ , ట్రెడ్ మిల్ వంటివి  బెస్ట్ ఆప్షన్స్. వీటి ద్వారా గుండెపోటు, బీపీ వంటి సమస్యలు దరిచేరవు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..