చలిలో వాటర్ ట్యాంక్ నీరు మంచులా గడ్డకట్టుకుపోతోందా? కరెంటు ఖర్చు లేకుండా నీళ్లు వెచ్చగా ఉండాలంటే..
చలికాలంలో ఇంటి పైకప్పుపై ఉండే వాటర్ ట్యాంక్‌లోని నీరు మంచులా చల్లగా మారిపోతుంటుంది. ఉదయాన్నే స్నానం చేయాలంటే గీజర్ లేదా వాటర్ హీటర్ వాడాల్సి రావడంతో కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. అయితే ఎలాంటి విద్యుత్ ఖర్చు లేకుండానే కొన్ని సులభమైన చిట్కాలతో ట్యాంక్ నీటిని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాంటి సింపుల్ చిట్కాలేంటో వివరంగా తెలుసుకుందాం..

శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేయడం లేదా ఇంటి పనులు చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా టెర్రస్‌పై ఉండే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లోని నీరు రాత్రిపూట చల్లని గాలులకు మంచులా మారిపోతుంది. దీనివల్ల గీజర్ లేదా ఎలక్ట్రిక్ రాడ్ వాడాల్సి వచ్చి కరెంటు బిల్లు భారీగా పెరుగుతుంది. అయితే పైసా ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ట్యాంక్ నీటిని సహజంగా వెచ్చగా ఉంచుకునే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
ట్యాంక్‌ను మందపాటి కవర్ లేదా బట్టతో కప్పండి
పగటిపూట ఎండ వల్ల ట్యాంక్‌లో చేరిన కొద్దిపాటి వేడి, రాత్రిపూట వీచే చల్లని గాలుల వల్ల త్వరగా ఆవిరైపోతుంది. దీనిని అరికట్టడానికి రాత్రి వేళల్లో ట్యాంక్‌ను మందపాటి దుప్పటి, పాత గోనె సంచులు, టార్పాలిన్ లేదా థర్మాకోల్ షీట్లతో కప్పి ఉంచాలి. ట్యాంక్ పైన చిన్న చెక్క లేదా టిన్ షెడ్ వేయడం వల్ల కూడా చల్లని గాలి నేరుగా తగలకుండా ఉండి, లోపలి నీరు వెచ్చదనాన్ని కోల్పోకుండా ఉంటుంది. దీనివల్ల ఉదయం పూట నీరు మరీ గడ్డకట్టినట్లుగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటుంది.
ట్యాంక్‌కు ముదురు రంగు వేయండి
మీరు ట్యాంక్‌కు నలుపు, ముదురు నీలం లేదా ముదురు గోధుమ రంగు పెయింట్ వేయడం చాలా మంచి ఉపాయం. లేత రంగులతో పోలిస్తే ముదురు రంగులు సూర్యరశ్మిని, వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. పగటిపూట ఎండలో ట్యాంక్ నెమ్మదిగా వేడెక్కడం వల్ల లోపలి నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనికి ఎలాంటి విద్యుత్ అవసరం ఉండదు.
ఎండ తగిలే ప్రదేశంలో ట్యాంక్ ఏర్పాటు
చలికాలంలో ట్యాంక్ నీరు మరీ చల్లగా ఉండకూడదంటే, డాబాపై రోజంతా నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో దానిని ఉంచడం ఉత్తమం. ఒకవేళ ట్యాంక్ నీడలో ఉన్నట్లయితే, అవకాశం ఉన్నవారు స్థలాన్ని మార్చుకోవడం వల్ల పగటిపూట సహజమైన ఎండతో నీరు కొంతవరకు వెచ్చబడుతుంది.
పైపులైన్లను కవర్ చేయడం మర్చిపోవద్దు
చాలామంది వాటర్ ట్యాంక్‌ను కవర్ చేస్తారు కానీ, బయటకు ఉండే పైపులను అలాగే వదిలేస్తారు. ట్యాంక్‌లో నీరు కొంత వెచ్చగా ఉన్నా, చల్లని గాలి తగిలే పైపుల గుండా కిందకు వచ్చేసరికి ఆ నీరు మళ్లీ చల్లబడిపోతుంది. కాబట్టి పైపుల చుట్టూ ఫోమ్ ఇన్సులేషన్ కవర్ లేదా పాత మందపాటి బట్టలను గట్టిగా చుట్టాలి.
సోలార్ వాటర్ హీటర్‌తో శాశ్వత పరిష్కారం
చలికాలంలో వేడి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలనుకుంటే సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేసుకోవడం అత్యుత్తమ ఎంపిక. దీనికి ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏళ్ల తరబడి కరెంటు బిల్లు భారం లేకుండా పర్యావరణానికి మేలు చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెచ్చని నీటిని పొందవచ్చు. ఈ సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే చలికాలంలోనూ గీజర్ ఖర్చు లేకుండా హాయిగా వేడి నీటిని వాడుకోవచ్చు.




