చలికాలంలో చన్నీటి స్నానం మంచిదేనా..? ఈ డౌట్ మీకూ ఉందా..

చలికాలం స్నానం చేయాలంటే ఏ నీటితో స్నానం చేయాలి.. 'వేడి నీళ్లతోనా, చన్నీళ్లతోనా.. అన్న ప్రశ్నే వస్తే ముమ్మాటికి గరం గరం నీటితోనే అనే సమాధానం వినిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం కూడా నష్టాన్నే తెచ్చిపెడుతుందంటున్నారు వైద్యులు. అలా అని చన్నీటి తో స్నానం కూడా సేప్ కాదంటున్నారు...

చలికాలంలో చన్నీటి స్నానం మంచిదేనా..? ఈ డౌట్ మీకూ ఉందా..
శీతాకాలంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఇది మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో చలి కాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

Edited By:

Updated on: Nov 21, 2025 | 10:08 AM

చలి కాలం వచ్చిదంటే చాలు.. ఉదయం నిద్ర లేవాలంటే శరీరం మొండికేస్తుంది. రాత్రయితే చలి మరింత చంపేస్తుంది. దుప్పటి నిండా కప్పుకుంటే కానీ చలి ఆగదు. అలాంటి ఉదయం నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఒంటి మీద నీళ్లు పడితే చాలు జల్లుమంటుంది. అలాంటిది చలి కాలం చన్నీటి తో స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తే.. వామ్మో ఇంకా తట్టుకోగలమా. నో.. నో.. నా వల్ల కాదంటూ ఖరాఖండిగా చెప్పేస్తోంది శరీరం. మరీ చలికాలం స్నానం చేయాలంటే ఏ నీటితో స్నానం చేయాలి.. ‘వేడి నీళ్లతోనా, చన్నీళ్లతోనా.. అన్న ప్రశ్నే వస్తే ముమ్మాటికి గరం గరం నీటితోనే అనే సమాధానం వినిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం కూడా నష్టాన్నే తెచ్చిపెడుతుందంటున్నారు వైద్యులు. అలా అని చన్నీటి తో స్నానం కూడా సేప్ కాదంటున్నారు. మరీ చలి కాలం ఏ నీటితో స్నానం చేయాలి? ఏది ప్రయోజనం? ఏది ప్రమాదం? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి..

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తేనే మేలు అన్న అభిప్రాయం చాలామంది నుండి వినిపిస్తుంది. చలికాలంలో‌ శరీరం గరంగరంగా ఉండాలంటే వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తేనే ఒంటికి వెచ్చదనం అని అంతా భావిస్తారు. కానీ వేడి నీటితో స్నానం శరీరానికి హాయినిచ్చినా.. అలసట నుంచి ఉపశమనం కలిగించినా.. చల్లదనం నుంచి కాపాడుతుందని భావించినా.. అది ఒంటికి మంచిది కాదంటున్నారు వైద్యులు. వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మానికి ప్రమాదమే అంటూ హెచ్చరిస్తున్నారు. చలి కాలంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి, రోమాలు దెబ్బతింటాయని, సహజంగా శరీరంపై ఉండే ఆయిల్ లేయర్ కూడా నష్ట పోతుందని చెప్తున్నారు. శరీర ఉపరితలంపై కెరెటిన్ అనే కణాలు ఉంటాయని. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ కణాలు దెబ్బతింటాయని. తామర , గజ్జి వంటి చర్మ సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రతరమవుతాయని చెప్తున్నారు వైద్య నిపుణులు‌. వేడి నీటి‌ స్నానం చర్మ సహజ రక్షణ కవచాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. మరీ చన్నీటితో స్నానం చేయాలా అంటే అది కూడా ప్రమాదమే అంటున్నారు చర్మ వైద్య నిపుణులు.

మరేం చేయాలి‌ అంటే…

మరీ చలి కాదు మరీ వేడి కాదు… గోరు వెచ్చని నీటితో స్నానమే ఉత్తమం అంటున్నారు‌. చలి ఏర్పడనంతగా వెచ్చదనాన్ని ఇచ్చేలా ఉండే గోరు వెచ్చని నీళ్లే ఉత్తమం అంటున్నారు. మానవ చర్మ బాహ్య పొరలో సెబమ్, లిపిడ్స్‌కు చెందిన పలుచని జిడ్డు పొర ఉంటుంది. అది బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి, బాహ్య ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మం పొడిబారకుండా తేమగా, మృదువుగా ఉంచడంలో కూడా ఈ పొర చాలా కీలకం. శరీరంపై వేడి నీళ్లు పోసుకున్నప్పుడు, మన చర్మంపై ఉండే ముఖ్యమైన ఆయిల్స్‌ అన్ని పోతాయని… ఎవరైనా మరీ వేడి నీళ్లు పోసుకుంటే, ఈ పొర త్వరగా పొడిబారుతుందని చెప్తున్నారు వైద్యులు. చర్మంపై ఉండే జిడ్డు పొర తొలగిపోతే దురదకు కారణమవుతాయని.. దాంతో చర్మ వ్యాదులు మరింత పెరుగుతాయని‌ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు పాలిసిథెమియా వెరా వ్యాదితో బాధపడుతుంటే.. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పాలిసిథెమియా వెరా అనేది.. చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలను విడుదల చేసే వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే వారు ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే, చర్మం మరింత ఎర్రగా కందిపోతుందని పేర్కొంటున్నారు చర్మ వైద్యులు.

ఇవి కూడా చదవండి

పట్టణ ప్రాంతాల్లో బిజిబిజి జిందగీలో ఆలస్యంగా నిద్ర లేచి త్వర త్వరగా రెడీ అయిపోయి చన్నీటిని కుమ్మరించుకుని‌ స్నానం చేసేస్తుంటారు చాలా మంది. అయితే అలా చేయడం కూడా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. పట్టణాల్లో గ్లిజార్ లు, వాటర్ హీటర్ లు వాడి నీటిని వేడి‌చేసుకుని స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని‌ చెప్తున్నారు‌. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలావరకు బోరుబావులు, బావి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. చలికాలంలో ఈ నీళ్లు గోరువెచ్చగా.‌. వేసవి కాలంలో చల్లగా ఉంటాయి. అందుకే ఈ నీళ్లనే ఎక్కువగా వాడుతుంటారు గ్రామీణ ప్రాంత వాసులు. అయితే, అలా చేయడం కూడా ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు.

భూగర్భ జలాల్లో ట్రేస్ మినరల్స్ ఉంటాయని..

ఉష్ణోగ్రతల పరంగా చూసుకుంటే, చలికాలంలో ఈ నీరు కాస్త వేడిగా, వేసవిలో కాస్త చల్లగా అనిపిస్తుంటుందని.. కానీ ఈ నీళ్లతో స్నానం చేస్తే కొన్ని సందర్భాలలో చర్మం మండటం, దురద వంటి సమస్యలను కలగజేస్తాయని చెప్తున్నారు వైద్యులు. అందుకే పట్టణమైన పల్లెటూరైనా వేడి నీళ్లకి చల్ల నీళ్లు తోడు అన్నట్టుగా గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయడం ఉత్తమం అంటున్నారు‌. ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పాడవ్వడమే కాకుండా.. జుట్టు కూడా దెబ్బతింటుందని.. జుట్టుకు సహజంగా ఉండే తేమ పోయి, జుట్టు పొడిబారడం, చిక్కులు పడటం, విరిగిపోవడం జరుగుతుందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.

వాతవరణం బాగా చలిగా ఉన్నప్పుడు, శరీరంపై మరింత చన్నీళ్లను పోస్తే.. అది మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని.. మానవ శరీరం పై సడన్ గా ఎక్కువ వేడి, లేదా ఎక్కువ చలి నీళ్లు పోస్తే, రక్తనాళాలు వెంటనే స్పందిస్తాయని..ఎక్కువ చన్నీళ్లు శరీరంపై పోసుకున్నప్పుడు రక్త నాళాలు సంకోచానికి గురై, బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) పెరుగుతుందని… ఒక్కసారిగా హార్ట్ రేటు కూడా పెరుగుతుందని.. అదే ఎక్కువ వేడి నీళ్లు అయితే, రక్త నాళాలు వ్యాకోచిస్తాయని… అప్పుడు బ్లడ్ ప్రెజర్ తగ్గి, కళ్లు తిరగడం లేదా మూర్ఛపోవడం జరుగుతుందని చెప్తున్నారు. అందుకే, ఎక్కువ వేడి నీళ్లతోను , ఎక్కువ చన్నీళ్లతోను స్నానం చేయకూడదని న్యూరాలజిస్ట్ లు సూచిస్తున్నారు. ఎక్కువ చన్నీళ్లు బ్లడ్ ప్రెజర్ వేగంగా పెరిగేందుకు కారణమవుతుందని… ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని వేగంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు వైద్యులు. చిన్నారులు, వృద్దుల చర్మం చాలా సున్నితంగా ఉంటుందని.. ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే, పొడిబారడం, దురద, చికాకు, చర్మం పగలడం పెరుగుతుందని.. అందుకే చలికాలం లో గోరువెచ్చటి నీటితో స్నానం చేయడమే ఉత్తమం అంటున్నారు వైద్యులు. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మరింత తప్పని‌సరి అని సూచిస్తున్నారు వైద్యులు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us