గ్యాస్ స్టవ్ మంట తగ్గిందా..! పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బర్నర్‌ను కొత్తదానిలా మార్చేయండి..
గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే మంట తక్కువగా వస్తోందా..? నీలంగా వెలగాల్సిన మంట కాస్తా పసుపు రంగులోకి మారిపోయిందా? చాలామంది గ్యాస్ అయిపోవచ్చిందేమో అనుకుంటారు.. లేదా బర్నర్ పాడైపోయిందని కొత్తది కొనడానికి రెడీ అవుతారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా మెకానిక్‌ని పిలవాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే బ్లాక్ అయిన బర్నర్ రంధ్రాలను నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు.

ప్రతి ఇంట్లోనూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరం కోసం గ్యాస్ స్టవ్ వెలుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత గ్యాస్ బర్నర్‌పై మంట తగ్గిపోవడం లేదా నీలం రంగులో రావలసిన మంట పసుపు రంగులోకి మారిపోవడం మీరు గమనించే ఉంటారు. కొంతమంది దీనిని చూసి భయపడి వెంటనే కొత్త బర్నర్ కొనాలని ఆలోచిస్తుంటారు, మరికొందరేమో లైట్ తీసుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే.. బర్నర్‌లోని చిన్న చిన్న రంధ్రాలు మురికి, జిడ్డుతో మూసుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ఇందుకోసం మెకానిక్‌ని పిలవాల్సిన అవసరం లేదు, రూపాయి ఖర్చు లేకుండా వంటింటి వస్తువులతోనే నిమిషాల్లో దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం…
అసలు బర్నర్ రంధ్రాలు ఎందుకు మూసుకుపోతాయి?
మనం ప్రతిరోజూ వంట చేసేటప్పుడు పాలు, చాయ్ పొంగిపోవడం లేదా కూరల జిడ్డు, నూనె, మసాలాలు తరచుగా బర్నర్‌పై పడుతుంటాయి. ఇవి క్రమంగా పేరుకుపోయి రంధ్రాలను బ్లాక్ చేస్తాయి. దీనివల్ల గ్యాస్ ప్రవాహం తగ్గి, మంట సరిగ్గా రాదు సగం గ్యాస్ వృథా అవుతుంది.
గోరువెచ్చని నీరు – నిమ్మకాయ మ్యాజిక్
గ్యాస్ బర్నర్‌ను క్లీన్ చేయడానికి ముందుగా ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయ రసం, కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ ద్రావణంలో బర్నర్లను వేసి 15 నుండి 20 నిమిషాల పాటు నాననివ్వండి. దీనివల్ల బర్నర్‌కు పట్టిన మొండి జిడ్డు మొత్తం మెత్తబడుతుంది.
పాత టూత్ బ్రష్‌తో ఇలా రుద్దండి..
నానిన తర్వాత బర్నర్లను బయటకు తీసి, మీ ఇంట్లో ఉండే పాత టూత్‌బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో కాస్త గట్టిగా రుద్దండి. బర్నర్‌లోని చిన్న చిన్న రంధ్రాలలో ఇరుక్కుపోయిన నలుసులను తీయడానికి పిన్ను లేదా సూదిని ఉపయోగించవచ్చు. అయితే సూదితో మరీ గట్టిగా పొడవకండి.. అలా చేస్తే రంధ్రాలు పెద్దవైపోయి గ్యాస్ లీకేజీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
నల్లటి మొండి మురికికి వెనిగర్ చిట్కా
మీ గ్యాస్ బర్నర్ బాగా నల్లగా మారిపోయి, ఎంత రుద్దినా వదలడం లేదా? అయితే దానిపై కొద్దిగా తెల్ల వెనిగర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత బ్రష్‌తో తేలికగా రుద్దితే చాలు.. బర్నర్ సరికొత్తగా మెరిసిపోతుంది. ఆపై శుభ్రమైన నీటితో కడిగేయండి.
కడిగిన వెంటనే వాడితే ప్రమాదం
బర్నర్‌ను కడిగిన వెంటనే స్టవ్‌పై పెట్టేయకండి. ముందుగా ఒక పొడి గుడ్డతో దాన్ని క్లీన్ తుడిచి, కాసేపు ఆరనివ్వండి. తడిగా ఉన్న బర్నర్‌ను ఉపయోగిస్తే గ్యాస్ సరిగ్గా మండదు.
ఈ చిన్న జాగ్రత్తలు మీకోసమే
- వారానికి కనీసం ఒక్కసారైనా బర్నర్లను తేలికగా శుభ్రం చేసుకోండి.
- పాలు లేదా ఆహార పదార్థాలు పొంగినప్పుడు వెంటనే స్టవ్ కదపకుండా పైపైన క్లీన్ చేయండి.
- బర్నర్ రంధ్రాలను శుభ్రం చేయడానికి మరీ లావుగా ఉన్న సూదులను వాడవద్దు.
- క్లీనింగ్ పూర్తయ్యాక, బర్నర్‌ను స్టవ్‌పై కరెక్ట్ ప్లేస్‌లో అమర్చడం మర్చిపోకండి.
