బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి
ఉదయం నిద్రలేచాక బ్రష్ చేసిన వెంటనే టీ, కాఫీ లేదా నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ అలవాటు పళ్ళ ఆరోగ్యానికి హానికరమని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ పళ్లపై ప్రభావం చూపేందుకు కనీసం 10-15 నిమిషాలు అవసరమవుతుంది. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే ఏ పానీయం తాగకుండా కొంత సమయం వేచి ఉంటే పళ్లు బలంగా ఉండటంతో పాటు కుహరాల నుంచి కూడా రక్షణ పొందుతాయి.

దంతాల ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యానికి అద్దం పడుతుంది. నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే కేవలం దంత సమస్యలే కాకుండా గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే రోజూ రెండుసార్లు ఉదయం, రాత్రి పళ్ళు తోముకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తారు. చాలామందికి ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రష్ చేసిన వెంటనే నీళ్లు, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు పళ్ళ ఆరోగ్యానికి హానికరమని దంత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ ఎందుకు ముఖ్యమైనది?
పళ్ళు తోముకున్న తర్వాత టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ పళ్ళపై ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడి పళ్ళను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే క్యావిటీస్ ఏర్పడకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
చాలామంది పళ్ళు తోముకున్న వెంటనే ఎక్కువ నీటితో నోరు కడుక్కోవడం లేదా నీళ్లు తాగడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్లోరైడ్ పొర త్వరగా తొలగిపోతుంది. దీంతో టూత్‌పేస్ట్ అందించే పూర్తి ప్రయోజనాలు పళ్ళకు అందవు. దంత వైద్యుల సూచనల ప్రకారం ఫ్లోరైడ్ ప్రభావం చూపడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం అవసరం. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇవి ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఫలితంగా క్యావిటీస్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
పళ్ళ ఆరోగ్యానికి పాటించాల్సిన అలవాట్లు
* రోజుకు కనీసం రెండు సార్లు పళ్ళు తోముకోవాలి. * బ్రష్ చేసిన తర్వాత 10-15 నిమిషాల వరకు ఏమీ తాగకుండా ఉండాలి. * తీపి పదార్థాలు తీసుకున్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి. * ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది. * సరైన టూత్‌బ్రష్, ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి.
బ్రష్ చేసిన తర్వాత పాటించే అలవాట్లు కూడా దంత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే దానిని మార్చుకోవడం మంచిది. చిన్న జాగ్రత్తలతోనే పళ్ళను చాలా కాలం పాటు ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు.
(నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీనిపై మరింత సమాచారం కావాలంటే దంత వైద్య నిపుణులను నేరుగా సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోగలరు)
