Salt Consumption: వామ్మో ఉప్పు.. ప్రాణాలు తీసేస్తుంది! డబ్ల్యూహెచ్ఓ నివేదికలో సంచలన విషయాలు..
రోజుకి సగటున ప్రతి మనిషి 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలనేది డబ్ల్యూహెచ్ఓ సూచన. కానీ ప్రపంచంలో సగటున ప్రతి మనిషి రోజుకి 10.9 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. దీని వల్ల అనేక రకాల జబ్బులు మనిషిని చుట్టుముడుతున్నాయి.
మన ఆహారంలో అది ఏమాత్రం తగ్గినా సహించలేం. ముద్ద దిగదు అంతే. జిహ్వకు అది సమపాళ్లలో ఉంటేనే సంతృప్తి. ప్రతి వంటింట్లో అవసరానికి మించే అది ఉంటుంది. ఓ రకంగా అది లేని వంటిల్లు ఉండదు. ఇంతకీ ఏమిటది అర్థం అయ్యిందా? అదేనండీ ఉప్పు. ఆ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో ఉప్పు తక్కువైంది అంటూ వంకలు పెట్టేవారు నిజ జీవితంలో మనకు చాలామందే తారసపడుతుంటారు. అయితే అలాంటి వారు ఇకపై జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అత్యధిక శాతం గుండె జబ్బులు ఈ ఉప్పు కారణంగానే వస్తున్నాయట. ఈ విషయం మేము చెబుతున్నది కాదు. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏమిటి ఆ నివేదిక? దానిలో ఏముంది? ఉప్పుకి మనిషి ఆరోగ్యానికి లింకేంటి చూద్దాం రండి..
సోడియం ప్రాణాంతకం..
మానవశరీరంలో సోడియం మోతాదు పెరిగితే గుండె సమస్యలు వస్తాయని చాన్నాళ్లుగా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తోంది. ఇది లా ఇలా కొనసాగితే చాలా మరణాలు సంభవిస్తాయిని నొక్కి చెబుతోంది. వంటల్లో మనం వాడే ఉప్పు సోడియం క్లోరైడ్. ఇందులో ఉండే సోడియం మోతాదు శరీరంలో పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మోతాదు ఎంత అనేదాని దగ్గరే అసలు సమస్య. మనం తినే ఆహార పదార్థాలతో ఏదో ఒక రూపంలో సోడియం మన శరీరంలోకి వెళ్తుంది. అయితే ఇటీవల కాలంలో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఈ సోడియం మరింత ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికి అదనంగా మనం రోజువారీ వంటల్లో వేసే ఉప్పు మరింత ముప్పుగా మారుతోంది.
లక్ష్యం పెట్టుకున్నప్పటికీ..
మన దేశంలో ఉప్పు వాడకం బాగా ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. అయితే కేవలం 9 దేశాలు మాత్రమే సోడియం వాడకాన్ని తగ్గించాయని పేర్కొంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, ఊబకాయం, ఎముకలు గుల్లబారడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయి. గుండెపోటు అనే అతి పెద్ద ప్రమాదం ఉండనే ఉంది. ఇప్పటికిప్పుడు ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది.
ఎంత తినేస్తున్నామో తెలుసా..
రోజుకి సగటున ప్రతి మనిషి 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలనేది డబ్ల్యూహెచ్ఓ సూచన. కానీ ప్రపంచంలో సగటున ప్రతి మనిషి రోజుకి 10.9 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారనేది వాస్తవం. అవసరానికి మించి అది కూడా రెట్టింపు కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్న మనం అనారోగ్యాలకు బలి కాకుండా ఎలా ఉండగలం. అందుకే గుండె జబ్బులు ప్రబలతున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న అకస్మాత్తు గుండె పోటులకు కూడా ఈ అధిక ఉప్పు వాడకం ఓ కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తోంది. కాబట్టి వీలైనంత ఉప్పును తగ్గించి తినాలని సూచిస్తోంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..