
బంగాళాదుంపను కూరగాయలలో రారాజు అని పిలుస్తారు. బంగాళాదుంప ఏడాది పొడవునా లభిస్తుంది. బంగాళాదుంపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచికి కూడా భలేగా ఉంటాయి. అందుకే వీటితో చేసిన వంటకాలు చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే వీటిని మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొటాషియం, విటమిన్ సి, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే బంగాళాదుంపలు ఎంత తినాలనే దానిపై తరచుగా ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళాదుంపలు పూర్తిగా హానికరం కానప్పటికీ వాటి అధిక వినియోగం పలు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రోజుకు 150-200 గ్రాముల ఉడికించిన బంగాళాదుంపలు తీసుకోవడం సురక్షితం.
బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, బరువు పెరగడం, రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు వస్తాయి. బంగాళాదుంపలను మితంగా తినడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. బంగాళాదుంపలు రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. అయితే, నూనెతో కూడిన బంగాళాదుంప ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌లో పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ , అక్రిలామైడ్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే వేయించిన బంగాళా దుంప చిప్స్ తినకూడదు.
రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది. బంగాళాదుంపలలోని స్టార్చ్ కొవ్వుగా మారే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి రాత్రి భోజనంలో బంగాళాదుంపలను పూర్తిగా నివారించడం మంచిది. బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ప్రమాదం పెరుగుతుంది. ఇది కాలక్రమేణా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఇది ఉబ్బరం, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి బంగాళాదుంపలను ఎల్లప్పుడూ మితంగా మాత్రమే తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.