Health: స్త్రీలలో గర్భసంచి తీసేస్తే ఈ సమస్యలు తప్పవు..!
గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీ సర్జరీ వల్ల అనస్థీషియా, పేగు అబ్స్ట్రక్షన్ వంటి ప్రమాదాలున్నాయి. 80% మందికి ఇది అనవసరం. దీనికి ప్రత్యామ్నాయంగా, గర్భాశయాన్ని సంరక్షించే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్ లేదా యూట్రైన్ ఆర్టరీ ఎంబొలైజేషన్ చికిత్స ఫైబ్రాయిడ్స్, ఇతర సమస్యలకు మెరుగైన, సురక్షితమైన పరిష్కారం అందిస్తుందని నిపుణులు చెబతున్నారు.

గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ సర్జరీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. దాదాపు 80 శాతం మంది మహిళలకు ఈ సర్జరీ నిజానికి అవసరం లేదు. చాలా సందర్భాలలో, రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి వంటి సాధారణ సమస్యలకు పరిష్కారంగా హిస్టరెక్టమీని ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలలో ఈ శస్త్రచికిత్సను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని.. హిస్టరెక్టమీ శస్త్రచికిత్సలో అనేక ప్రమాదాలు దాగి ఉన్నాయని అంటున్నారు. మొదటిది, జనరల్ లేదా స్పైనల్ అనస్థీషియాతో వచ్చే నష్టాలు. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం సరిగా లేని వారికి మత్తుమందు వల్ల దుష్ప్రభావాలు, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. రెండవది, సర్జరీ సమయంలో పొత్తికడుపులోని పెరిటోనియం వంటి అవయవాలను కప్పి ఉంచే పొరలను కత్తిరించడం వల్ల భవిష్యత్తులో పేగులు అబ్స్ట్రక్షన్ కావడం, ఫైబ్రోసిస్ ఏర్పడటం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.
అలాగే, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఏ వైద్య విధానానికైనా, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను బేరీజు వేసి ఎంచుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. సంప్రదాయ హిస్టరెక్టమీకి ఒక అద్భుతమైన, గర్భాశయాన్ని సంరక్షించే ప్రత్యామ్నాయం ఉందటున్నారు నిపుణులు. అదే యూట్రైన్ ఆర్టరీ ఎంబొలైజేషన్ (UAE) లేదా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్ (UFE). ఫైబ్రాయిడ్స్ ఉన్నవారికి ఈ చికిత్స చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ వల్ల రుతుక్రమ సమయంలో నొప్పి, నెల మధ్యలో స్పాటింగ్, మూత్రాశయంపై ఒత్తిడి వల్ల తరచుగా మూత్రవిసర్జన, మలబద్ధకం, శారీరక సంబంధంలో ఇబ్బంది, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఇటువంటి సమస్యలకు హిస్టరెక్టమీని సూచించేవారు. తరువాత ఫైబ్రాయిడ్‌ను మాత్రమే తొలగించే మయోమెక్టమీ వచ్చింది. ఇప్పుడు, UAE అనే అత్యాధునిక విధానం ద్వారా గర్భాశయాన్ని ఎటువంటి డ్యామేజ్ లేకుండా సంరక్షించవచ్చు. ఈ ప్రక్రియలో ఫైబ్రాయిడ్‌కు రక్త సరఫరాను నిలిపివేసి, దానిని ఒక చిన్న స్కార్‌గా మార్చుతారు, తద్వారా గర్భాశయం చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం వంటి సందర్భాలలో కూడా గర్భాశయాన్ని కాపాడటానికి UAE సహాయపడుతుంది. ఈ విధానం స్థానిక అనస్థీషియా కింద జరుగుతుంది, కేవలం రక్తనాళంలోకి ప్రవేశించే చోట 3 నుంచి 5 ml అనస్థీషియా ఇస్తే సరిపోతుంది. కోతలు, కుట్లు, డ్రెస్సింగ్ అవసరం ఉండదు. ఇది బాధితులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆసుపత్రిలో కేవలం ఒక రోజు ఉండి, మరుసటి రోజు నుంచే సాధారణ పనులు చేసుకోవచ్చు. UFE తర్వాత పొత్తికడుపులో కొంత నొప్పి ఉండవచ్చు, దీనిని సాధారణ పెయిన్ కిల్లర్స్‌తో నియంత్రించవచ్చు. మొత్తం మీద, యూట్రైన్ ఆర్టరీ ఎంబొలైజేషన్ అనేది గర్భాశయాన్ని రక్షించుకోవడానికి ఒక సురక్షితమైన, సమర్థవంతమైన పద్ధతిగా డాక్టర్స్ చెబుతున్నారు.
(ఈ సమాచారం వైద్య నిపుణుల నుంచి సేకరించాం.. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. అనుభవం ఉన్న వైద్యులను సంప్రదించండి)




