Solo Trips: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. మహిళలు కచ్చితంగా పాటించాల్సిన సేఫ్టీ టిప్స్ ఇవి..
మహిళలు ఒంటరిగా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణ విషయమే. కానీ ఎక్కడికెళ్లినా మీ సాహస యాత్ర విషాద యాత్ర కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే ప్రత్యేకంగా ఆడవారు ఒంటిరగా ట్రిప్పులకు వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఇవి పాటిస్తే మీ జర్నీ సేఫ్ గా సాగడమే కాదు.. లైఫ్ లాంగ్ మర్చిపోలేనన్ని అనుభవాలను మీ వెంట తెచ్చుకోగలుగుతారు.

మీరు మీ ప్రయాణాలకు బయలుదేరేటప్పుడు ముందు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో దాని మీద కాస్తైనా రీసెర్చ్ చేయడం ఎంతో అవసరం. అక్కడి స్థానికుల అలవాట్లు, కల్చర్, సంప్రదాయాలు వంటివి మీ భద్రతను కట్టుదిట్టంగా మలుచుకోవడంలో మీకు సాయపడతాయి. అందుకే ముందే వీటిని తెలుసుకుని ఉండటం మంచిది. అక్కడి స్థానికులు ఎలాంటి బట్టలు వేలసుకుంటున్నారు. ఎలా మాట్లాడుతు్నారు. వారి జీవన విధానం వంటి విషయాలను అర్థం చేసుకోగలిగితే మీరూ వారితో కలిసిపోతారు. అందుకోసం దీనికి కాస్త టైం కేటాయించుకోండి.
ఎక్కడ స్టే చేయాలి..
మీరు వెళ్లే చోట ముందే ఎక్కడ ఉండాలో ప్లాన్ చేసుకుని వెళ్లండి. అన్నిసార్లు అక్కడి ప్రదేశాలు మనకు అనుకూలంగా ఉండవని గుర్తుంచకోవాలి. ఇప్పటికే మీలాంటి మహిళా సోలో ట్రావెలర్స్ ఇచ్చే రివ్యూలను ఆన్లైన్ లో చెక్ చేయండి. వీలైతే అక్కడే మంచి హాస్టళ్లు రూములను ఎంచుకోండి. లిఫ్ట్ కు వీలైనంత మీ గది ఉండేలా చూసుకోండి. మీ రూమ్ నంబర్ ను తెలియని వారితో షేర్ చేసుకోకండి.
మీ కుటుంబంతో కనెక్టయ్యేలా..
మీరు ఎక్కడ ఉన్నారో మీ ఫ్యామిలీలో కనీసం ఒక్కరికైనా పూర్తి సమాచారం ఉండేలా ప్లాన్ చేసుకోండి. అది గూగుల్ మాప్స్, వాట్సప్ ఇలా ఏదైనా కావచ్చు మీ లైవ్ లొకేషన్ ను ఎల్లప్పుడూ షేర్ చేస్తూ ఉండండి. మీ అత్యవసర కాంటాక్ట్ లిస్టును ఆఫ్ లైన్లో ముందుగానే ఒక దగ్గర సేవ్ చేసుకుని ఉంచుకోండి. మీ ఫోన్ పనిచేయకపోయినా, మీ లగేజ్ వంటివి పోగొట్టుకున్నా ఇది మీకు సాయపడుతుంది.
డ్రెస్సింగ్ విషయంలో ఈ పొరపాట్లు వద్దు..
కంఫర్ట్ గా ఉండే దుస్తులనే ఎంచుకోండి. మీరు ఎక్కడకు వెళ్తున్నారో ఆ వాతావరణానికి తగ్గట్టుగా బట్టలను ఎంపిక చేసుకోండి. మీరున్న చోటు మీకసలు తెలియదన్న భావన మీ ముఖంలో కనిపించకూండా జాగ్రత్త తీసుకోండి. కాన్ఫిడెంట్ గా నడవండి. అప్పుడు మోసగాళ్ల బారిన పడకుండా ఉంటారు. మీ ఫోన్ లో మునిగిపోకండి. కాస్త చుట్టూ ఓ కన్నేసి ఉంచడం మంచిది.
క్యాబ్ లేదా వాహనం.. ఈ మిస్టేక్స్ వద్దు..
ఊబర్ లేదా ఓలా ఇలా గుర్తింపు పొందిన ట్యాక్సీ సర్వీసులను వాడుకోండి. తక్కువ చార్జ్ చూపిస్తుందని తెలిసీ తెలియని యాప్ లను డౌన్లోడ్ చేసుకుని వాడొద్దు. మీరు వెనక సీట్లో కూర్చుంటే గనుక మీ ప్రయాణ వివరాలను, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలను మీవారికి ఫోన్ చేసి తెలియజేయండి.
అపరిచితులతో జాగ్రత్త..
కొత్త వ్యక్తులను కలవడానికి పరిచయాలు పెంచుకోవడానికి ఇలాంటి ట్రిప్పులు చాలా ఉపయోగపడతాయి. కానీ మీ సేఫ్టీనే ఎల్లప్పుడూ మీకు ముఖ్యం కావాలి. మీ మనసు కీడు శంకిస్తే అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోండి. ఇబ్బందికర పరిస్థితుల దగ్గర ఎక్కువ సమయం గడపొద్దు. తెలియని వారిని కలిసినా మీ పూర్తి వివరాలు వారితో పంచుకోవద్దు.
హ్యాండ్ బ్యాగులో ఇవి తప్పనిసరి..
మీ హ్యాండ్ బ్యాగులో కొన్ని ఎమర్జెన్సీ పరికరాలను ఎప్పుడూ తీసుకెళ్లండి. అది ఎమర్జెన్సీ అలారం కావచ్చు. లేదా పెప్పర్ స్ప్రే లాంటివి తీసుకెళ్లండి. అయితే, వీటికి మీరున్న చోట అనుమతులు ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. కొన్ని అనుకోని ప్రమాదాల నుంచి ఇవి మిమ్మల్ని కాపాడతాయి.
విలువైన వస్తువులు ఇలా..
మీ నగదు, కార్డులన్నింటినీ ఒకే చోట తీసుకెళ్లండి. వాటి కోసం వాలెట్, పాకెట్స్ వంటివి విభజించి సేఫ్ గా పెట్టుకోండి. మీ ఫోన్ ను ఎప్పుడూ సురక్షితమైన ప్లేస్ లోనే ఉంచుకోండి. వాటికి బ్యాకప్ వంటివి ఉంచుకోండి. హోటల్ లాకర్ సౌకర్యాలను కూడా వాడుకోండి.




