Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg for heart health: గుండెకూ.. గుడ్డుకీ లింకు? రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది? పరిశోధకులు తేల్చిందిదే!

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని ఇది గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందన్న భయం చాలా మందిలో వెంటాడుతోంది. అయితే నిజంగా గుడ్డు వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

Egg for heart health: గుండెకూ.. గుడ్డుకీ లింకు? రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది? పరిశోధకులు తేల్చిందిదే!
Follow us
Madhu

|

Updated on: Feb 10, 2023 | 12:45 PM

రోజూ యాపిల్ తింటే డాక్ట‌ర్‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతుంటారు. అలాగే రోజుకో గుడ్డు తింటే వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. అయితే ఈ గుడ్డును తినడంపై చాలామంది లో అపోహలు ఉన్నాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని ఇది గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందన్న భయం చాలా మందిలో వెంటాడుతోంది. అయితే నిజంగా గుడ్డు వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? ఇదే అంశంపై ఇటీవల చేసిన ఓ పరిశోధన పత్రం న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. బోస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 2,300 కంటే ఎక్కువ మంది పెద్దవారి డాటాను తీసుకొని అధ్యయనం చేశారు. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ సుగర్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

ఒకటీ లేదా రెండు గుడ్లు..

ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను కేవలం తెల్లసొనతో తీసుకోవడం మేలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. గుడ్లలో ఉండే ప్రోటీన్, ఇతర పోషకాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. గుండెకు హాని చేసే కొవ్వులను నిరోధిస్తుందని వివరిస్తున్నారు.

గుడ్డులో ఏముంటుంది..

సగటు ఆరోగ్యవంతుడైన మనిషికి అతని శరీర బరువుకు అనుగుణంగా ప్రతి కేజీకి రోజుకు 0.8 గ్రాముల నుంచి ఒక గ్రాము ప్రోటీన్ అవసరం. అంటే మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే మీకు 40 నుంచి 60 గ్రాముల ప్రోటీన అవసరం అవుతుంది. ఒక గుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది రక్తపోటును నివారించేందుకు సాయపడుతుంది. అలాగ గుడ్డులో విటమిన్‌ ఏ – 6 శాతం, విటమిన్‌ బీ5 – 7 శాతం, విటమిన్‌ బీ12 – 9 శాతం, విటమిన్‌ బీ2 – 15 శాతం, ఫాస్పరస్‌ – 9 శాతం, సెలేనియం – 22 శాతం ఉంటాయి.

ఇవి కూడా చదవండి

తేలికగా జీర్ణం..

పప్పు, మాంసాహారంలోని ప్రోటీన్‌ల కంటే గుడ్డులోని ప్రోటీన్లు తేలికగా జీర్ణమవుతాయి. గుడ్డులోని కొలెస్ట్రాల్‌ నేరుగా రక్తంలో కలవకుండా ఇందులోని లెసిఫిన్‌ వంటివి కాపాడతాయి. తెల్లసొనలో 90 శాతం నీరుండి.. మిగతా 10 శాతంలో అల్బుమిన్‌, గ్లొబిలిన్‌ వంటి ప్రోటీన్లు ఉంటాయి. అలాగే, వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అయితేవ గుడ్లను వేయించడం కన్నా ఉడకబెట్టి తినడం వల్ల పోషకాలు బాగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..