AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం… సంసారంలో శాంతికి వివేకమే ముఖ్యమని చెప్పే ఈ కథ అందరూ తెలుసుకోవాలి!

మానవ జీవితంలో సంపాదన ఏ స్థాయిలో ఉందో, దానిని అనుభవించే విధానం కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని మన ప్రశాంతతకు, ఆరోగ్యానికి ఉపయోగించడం అంతకంటే ముఖ్యం. కానీ, కొంతమంది పొదుపు పేరిట పిసినారితనానికి లోనై వర్తమాన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని బలిపెడుతుంటారు. ఈ విషయాన్ని ప్రతిబింబించే అద్భుతమైన కథే సుబ్బారావు, సుబ్బలక్ష్మిల వృత్తాంతం.

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి వివేకమే ముఖ్యమని చెప్పే ఈ కథ అందరూ తెలుసుకోవాలి!
Miserly Wife Moral Story
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2026 | 6:06 PM

Share

చందనాపురం అనే ఊరిలో సుబ్బారావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. సుబ్బారావు ప్రశాంత స్వభావం కలవాడు, జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకునే విజ్ఞాని. అయితే, ఆయన భార్య సుబ్బలక్ష్మి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆమెకు డబ్బు దాచుకోవడం తప్ప మరేదీ పట్టదు. ఈ డబ్బు దాచుకునే అలవాటు మామూలు స్థాయిని దాటి పిసినారితనంగా మారింది.

ఒక రోజు ఉదయం సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా, సుబ్బలక్ష్మి వంటగదిలో ఏదో గొణుగుతూ ఉంది. గంటసేపటి నుంచి ఆమె గొణుగుతుండటం గమనించిన సుబ్బారావు, ఆమెను పిలిచి కాస్త టీ ఇస్తావా అని అడిగాడు సుబ్బారావు. ఆమె తెచ్చిచ్చిన టీ తాగి ఆశ్చర్యపోయాడు. అందులో తీపి అస్సలు లేదు.

తన భార్యను పిలిచి, టీలో పంచదార వేయడం మర్చిపోయావా? లేక కావాలనే తగ్గించావా? అని ప్రేమగా అడిగాడు. దానికి సుబ్బలక్ష్మి చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చింది. మార్కెట్‌లో పంచదార ధర బాగా పెరిగింది, అందుకే ఇంటి ఖర్చు పెరగకుండా ఉండటానికి పావు చెంచా తక్కువ వేశాను. అయినా తక్కువ పంచదార వాడటం ఆరోగ్యానికి మంచిదే కదా! అని వాదించింది.

ఇవి కూడా చదవండి

సుబ్బారావు నవ్వుతూ, నీ పిసినారితనాన్ని భలే కప్పి పుచ్చుకుంటున్నావు గానీ, ఈరోజు సంత వైపు వెళ్తున్నాను. మనకి కూరగాయలు ఏమైనా తేవాలా? అని అడుగుతాడు.. అందుకు ఆమె..వద్దండి! ఈరోజుకి రాత్రి మిగిలిన పప్పు ఉంది, దాంట్లో కాస్త నీళ్లు కలిపి ఉడికిస్తే చారు అవుతుంది. ఇక రేపటికంటారా.. మొన్న తెచ్చిన వంకాయల్లో కొన్ని కుళ్లిపోయి ఉన్నాయి, ఆ కుళ్లిన భాగం తీసేసి వండితే వంట అద్భుతంగా ఉంటుంది, అంది సుబ్బలక్ష్మి.

ఆ మాటలకు సుబ్బారావు ఆశ్చర్యపోతూ, అబ్బా! నీ పిసినారితనం ఏట్లో కొట్టుకుపోను! అసలు మనం సంపాదిస్తున్నది ఎందుకు, హాయిగా తిని ప్రశాంతంగా ఉండటానికే కదా? ఆ కుళ్లిన వంకాయలు తిని కడుపునొప్పితో రేపు ఆసుపత్రికి వెళ్తే ఈ వంద రూపాయల పొదుపు కాస్త వేల రూపాయల ఖర్చుకి దారి తీస్తుంది, అని హెచ్చరించాడు. దానికి ఆమె, కడుపునొప్పి వస్తే ఆసుపత్రికి ఎందుకు వెళ్తామండి, కాస్త వాము నమిలితే సరిపోతుంది.. మీకు ఎప్పుడూ ఖర్చు పెట్టడమే తెలుసు. రేపు మనకి ముసలితనం వస్తే ఎవరు చూస్తారు? ఈ దాచుకున్న పైసలే కదా మనకు దిక్కు అంటుంది. ముసలితనం వచ్చే వరకైనా బతకాలి కదా సుబ్బలక్ష్మి! ఈ తిండి తింటే ముసలితనం రాకముందే పరలోక యాత్ర ఖాయం అంటాడు.. సరే, ఇవాళ నా స్నేహితుడు సోమయాజులు వస్తున్నాడు, కనీసం వాడికైనా మంచి భోజనం పెట్టాలి కదా? అన్నాడు సుబ్బారావు

సోమయాజులా? ఆయనేం ఇక్కడే తింటారా ఏంటి? కాస్త టీ ఇచ్చి పంపించేయండి. అయినా ఇవాళ పాలు కూడా తక్కువ ఉన్నాయి, సగం నీళ్లు కలిపి ఇస్తానులే, అంది సుబ్బలక్ష్మి. భార్య పిసినారితనం చూసి సుబ్బారావుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆమెతో గొడవ పడితే లాభం లేదని, ఏదైనా యుక్తి ప్రయోగించి ఆమెను మార్చాలని అనుకున్నాడు. కాసేపటికి సోమయాజులు వచ్చాడు. సుబ్బారావు అతన్ని లోపలికి ఆహ్వానించాడు. లోపల నుంచి సుబ్బలక్ష్మి టీ ఈతీసుకోచ్చింది. సోమయాజులు ఆ టీ తాగి ముఖం మార్చుకుని, ఏంటమ్మా సుబ్బలక్ష్మి, టీ కి బదులు కాషాయం తెచ్చినట్టున్నారు? అన్నాడు. దానికి ఆమె, పాలు చాలా చిక్కగా ఉంటే అరగవని కాస్త నీళ్లు కలిపాను, రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం కదా! అంది.

సుబ్బారావు సోమయాజుల వైపు చూసి సైగ చేసి, భార్యను వంటగదిలోకి వెళ్లమని చెప్పాడు. సుబ్బలక్ష్మి లోపలికి వెళ్లాక, సుబ్బారావు గొంతు తగ్గించి సోమయాజులతో నాటకం ప్రారంభించాడు:

ఒరేయ్ సోమయాజులు! ఇవాళ పొద్దున నాకు ఒక సిద్ధాంతి గారు కలిశారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు వండి పెడతారో, వారి ఇంట్లో ఉన్న బంగారం రెట్టింపు అవుతుందని ఒక రహస్యం చెప్పారు. అని..చాటుగా వింటున్న సుబ్బలక్ష్మికి బంగారం అంటే ప్రాణం కాబట్టి చెవులు రిక్కించింది.

ఇంతలో సోమయాజులు అందుకుని, అవునురా! దీని పేరు కనకవృద్ధి యాగం. కాకపోతే దీనికి ఇంట్లో పిసినారితనం అస్సలు ఉండకూడదు. వచ్చిన అతిథికి మంచి భోజనం పెడితే లక్ష్మీదేవి కరుణించి కనక వర్షం కురిపిస్తుంది, అన్నాడు.

సుబ్బారావు నిట్టూరుస్తూ, కానీ మా ఇంట్లో అది సాధ్యం కాదురా, మా సుబ్బలక్ష్మికి పొదుపే ప్రాణం, అన్నాడు.

ఆ మాట వినగానే సుబ్బలక్ష్మి గబగబా బయటకు వచ్చి, వరు చెప్పారు నేను ఖర్చు పెట్టనని? ధర్మం కోసం, దైవం కోసం ఖర్చు పెట్టడానికి నేనెప్పుడూ ముందే ఉంటాను! ఏవండీ సోమయాజుల అన్నయ్య, మా ఆయన చెప్పేది నిజమేనా? అని అడిగింది.

ఖచ్చితంగా నిజమేనమ్మా! అయితే వంటలు అద్భుతంగా ఉండాలి, ఇల్లంతా శుభ్రంగా ఉండి నిష్టగా వంట చేసి అతిథిని దేవుడిలా చూడాలి, అని సోమయాజులు చెప్పాడు.

వెంటనే సుబ్బలక్ష్మి ఎప్పుడూ లేనిది తన కొంగున ఉన్న రూ500 నోటు తీసి భర్తకిస్తూ, ఇదిగోండి రూ.500, ఇప్పుడే మార్కెట్‌కి వెళ్లి మంచి బాస్మతి బియ్యం, స్వచ్ఛమైన నెయ్యి, మేలైన కూరగాయలు తీసుకురండి! అంది . జీవితంలో మొదటిసారి సుబ్బలక్ష్మి రూ.500 తీయడం చూసి సుబ్బారావు మనసులోనే నవ్వుకున్నాడు.

మధ్యాహ్నానికి ఇల్లంతా గుమగుమలాడిపోయింది. సుబ్బలక్ష్మి ఉత్సాహంగా ఇల్లు శుభ్రం చేసి, పాత చాపలు తీసేసి కొత్త దుప్పట్లు పరిచి, కొత్త పట్టు పంచె భర్తకిచ్చి, అందరికీ రాజభోజనం వడ్డించింది. ముగ్గురూ తృప్తిగా తిన్నారు.

భోజనం అయ్యాక సోమయాజులు, అమ్మా సుబ్బలక్ష్మి, ఇప్పుడు అసలైన పని ఉంది. నీ దగ్గర ఉన్న బంగారాన్ని పట్టు వస్త్రంలో చుట్టి దేవుడి గదిలో పెట్టు. రాత్రంతా దీపం వెలుగుతూనే ఉండాలి, రేపు ఉదయానికి అది రెట్టింపు అవుతుంది. కాకపోతే రాత్రి నువ్వు పిసినారి ఆలోచనలు చేయకూడదు, అని చెప్పి వెళ్లాడు. సుబ్బలక్ష్మి తన రెండు కాసుల బంగారు గొలుసును పూజ గదిలో ఉంచింది.

ఆ రాత్రి అందరూ పడుకున్నాక, సుబ్బారావు రహస్యంగా దేవుడి గదిలోకి వెళ్లడం నిద్రమత్తులో ఉన్న సుబ్బలక్ష్మి చూసింది గానీ అది కల అనుకుంది.

తెల్లవారేసరి కల్లా సుబ్బలక్ష్మి పరుగున దేవుడి గదికి వెళ్లి చూసింది. అక్కడ ఆమె రెండు కాసుల గొలుసు పక్కన మరొక రెండు కాసుల కొత్త గొలుసు ఉంది! ఏవండీ! అద్భుతం జరిగింది, నా బంగారం రెట్టింపు అయింది! అని అరిచింది.

సుబ్బారావు నవ్వుతూ వచ్చాడు. ఆ కొత్త గొలుసు ఆయన తన గత సంవత్సర సంపాదనతో దాచి కొన్నది. చూసావా సుబ్బలక్ష్మి! మనం హాయిగా ఉండి, మంచి తిండి తిని నలుగురికీ పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పిసినారితనం ఉన్నచోటే దరిద్రం ఉంటుంది, అని సుబ్బారావు అన్నాడు.

అప్పుడే సుబ్బలక్ష్మికి రాత్రి భర్త పూజ గదిలోకి వెళ్లడం గుర్తుకొచ్చింది. తప్పు తెలుసుకుని, ఏవండీ, నాకు అంతా అర్థమైంది. డబ్బు దాచడంలో పడి జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయాను. ఇక నుంచి నేను పిసినారి సుబ్బలక్ష్మిని కాదు, అందరినీ ప్రేమించే సుబ్బలక్ష్మిని అవుతాను, అని కంటతడి పెట్టుకుంది.

ఆ రోజు నుంచి సుబ్బలక్ష్మి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పాత వంకాయలు, నీళ్ల పాలు మాయమై ప్రతిరోజూ మంచి ఆహారం, ఆనందం వెల్లివిరిసాయి. ఒకరోజు సుబ్బలక్ష్మి మార్కెట్ నుంచి మంచి పండ్లు కొందామని భర్తను అడిగితే, సుబ్బారావు సరదాగా అబ్బో! అంత ధరా? అన్నాడు. దానికి సుబ్బలక్ష్మి నవ్వుతూ, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదండీ! అంది.

తెలివైన భర్త వేసిన ఉపాయంతో ఆ పిసినారి భార్య ఇంటి మహాలక్ష్మిగా మారింది.

కథలోని నీతి:

డబ్బు అనేది మానవ అవసరాలు తీర్చుకోవడానికి, సంతోషంగా జీవించడానికి ఒక సాధనం మాత్రమే. సంపాదించిన దాన్ని సరైన రీతిలో అనుభవించకుండా, కాగితపు కట్టలు చూసి మురిసిపోవడం వల్ల జీవితం వ్యర్థమవుతుంది. మన ఆరోగ్యం, సంతోషం, ఇతరులకు సహాయం చేసే గుణమే అసలైన ఐశ్వర్యం. భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిదే, కానీ అది వర్తమాన ఆనందాన్ని సమాధి చేయకూడదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు