AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: ఆపదలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు.. ఎలుక – డేగ కథ

కడివెడు పాలల్లో చుక్క విషం వేస్తే ఏమవుతుంది..? స్నేహం కూడా అలాంటిదే. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఛాయిస్‌లు ఏమిటి అనేవి మన ప్రవర్తన, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచి స్నేహితుల్లో ఒక్క విషపురుగు ఉన్నా అందరూ కలుషితం అవుతారు. చెడు స్నేహం, మంచి స్నేహం మధ్య భేదాన్ని పిల్లలకు ఈ కింది కథ ద్వారా చెబితే.. చిన్నతనం నుంచే తమ ఛాయిస్‌లను బెటర్‌గా ఎంచుకుంటారు..

Moral Story: ఆపదలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు.. ఎలుక - డేగ కథ
Little Mouse And Eagle Story
Srilakshmi C
|

Updated on: Aug 05, 2026 | 8:16 PM

Share

అనగనగా ఒక పెద్ద అడవిలో కొన్ని ఎలుకలు కలిసి జీవిస్తూ ఉండేవి. అవి చుట్టుపక్కల దొరికే ఆహార ధాన్యాలను తింటూ ఆనందంగా కాలం గడిపేవి. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఎలుకకు అక్కడి జీవితం బోర్ కొట్టింది. కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త అనుభవాలు పొందాలని అనుకుంది. ఒక రోజు అది తన తోటి ఎలుకలతో ఇలా చెప్పింది. ‘మిత్రులారా! నాకు ఇక్కడ చాలా విసుగుగా ఉంది. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దామా?’ అని అడిగింది. అప్పుడు గుంపులోని ఓ పెద్ద ఎలుక దానిని వారిస్తూ.. ‘వద్దు మిత్రమా! మనకు ఇక్కడే చాలా సురక్షితంగా ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్లి తెలియని ఆపదలను తెచ్చుకోవడం ఎందుకు? ఇక్కడే అందరం కలిసి ప్రశాంతంగా ఉందాం’ అని చెప్పింది. కానీ ఆ ఎలుక పెద్దల మాట వినలేదు.

‘లేదు, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను తప్పకుండా కొత్త ప్రదేశానికి వెళ్తాను’ అని చెప్పి ఒంటరిగా బయలుదేరింది. కొత్త ప్రాంతాలను చూస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. ఆ ఆనందంలో తన చుట్టూ ఉన్న ప్రమాదాలను గమనించలేదు. అదే సమయంలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఒక డేగ కంట ఆ ఎలుక పడింది. వెంటనే డేగ తన పదునైన గోళ్లతో ఎలుకను పట్టుకుంది. అనుకోని ప్రమాదంతో భయపడిపోయిన ఎలుక.. ‘అయ్యో డేగ గారూ! నన్ను వదిలేయండి. మీకు పుణ్యం ఉంటుంది’ అంటూ వేడుకుంది. అప్పుడు డేగ ‘రెండు రోజులుగా నాకు, నా పిల్లలకు ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్నాం. నిన్ను వదిలేస్తే మా ఆకలి ఎలా తీరుతుంది?’ అని చెప్పి ఎలుకను తన పిల్లల దగ్గరకు తీసుకెళ్లింది. ‘పిల్లలూ! మీ కోసం మంచి ఆహారం తీసుకొచ్చాను’ అని డేగ పిలవగానే పిల్లలన్నీ అక్కడికి వచ్చాయి.

అప్పుడు ఆ ఎలుకకు పెద్దలు చెప్పిన మాట విననందుకు బాధ కలిగింది. అయినా చివరి ప్రయత్నంగా డేగను వేడుకుంది. ‘పక్షిరాజా! నాకు ఇంకా కొంతకాలం జీవించాలని ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎలుక ఏడుపు చూసిన డేగ పిల్లలకు జాలి కలిగింది. ‘అమ్మా! ఇది చాలా భయపడుతోంది. పాపం దీనిని వదిలేద్దాం’ అని అడిగాయి. మిగతా పిల్లలు కూడా ‘అవును అమ్మా, దీనిని వదిలేద్దాం’ అని కోరాయి. అప్పుడు ఎలుక ‘మీరు నన్ను కాపాడితే మీతో ఎప్పటికీ స్నేహంగా ఉంటాను’ అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

పిల్లల మాటలకు మనసు కరిగిన డేగ ఎలుకను వదిలేసింది. ఆ రోజు నుంచి ఎలుక అక్కడే ఉండి డేగ పిల్లలతో స్నేహం చేసింది. ఎలుక, డేగ పిల్లలు మంచి మిత్రులుగా మారి కలిసి ఆనందంగా జీవించసాగాయి. ఒక రోజు డేగ ఆహారం కోసం బయటకు వెళ్లింది. అదే సమయంలో ఒక వేటగాడు పక్షులను పట్టుకోవడానికి ఒక వల వేసి వెళ్లాడు. ఆ విషయం తెలియని డేగ పిల్లలు ఆ వలలో చిక్కుకున్నాయి. ‘ఎవరైనా మమ్మల్ని కాపాడండి!’ అంటూ అవి గట్టిగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక వెంటనే తన కలుగు నుంచి బయటకు వచ్చింది. తన స్నేహితులు వలలో చిక్కుకున్నారని చూసి బాధపడింది. ‘మిత్రులారా! భయపడకండి. నేను మిమ్మల్ని కాపాడుతాను’ అని ధైర్యం చెప్పింది. తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరకడం ప్రారంభించింది. కొద్దిసేపటికి వల తెగిపోయింది. డేగ పిల్లలు సురక్షితంగా బయటపడ్డాయి. అవి ఆనందంతో ‘మిత్రమా! నువ్వు లేకపోతే మా ప్రాణాలు పోయేవి. మాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు’ అని చెప్పాయి.

అప్పుడు ఎలుక నవ్వుతూ ‘అలా అనకు మిత్రులారా! ఆ రోజు మీరు మీ అమ్మతో చెప్పి నన్ను కాపాడకపోతే నేను ఎప్పుడో మీకు ఆహారంగా మారిపోయేవాడిని. మీరు చేసిన మేలుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి’ అని చెప్పింది. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. సాయంత్రం డేగ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పిల్లలు జరిగిన విషయం చెప్పారు. ‘అమ్మా! మనం ఎలుకతో స్నేహం చేయడం వల్లే ఈ రోజు మన ప్రాణాలు కాపాడబడ్డాయి’ అని అన్నారు. డేగ కూడా నిజమేనని అంగీకరించి ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుంచి ఎలుక, డేగ కుటుంబాల మధ్య స్నేహం మరింత బలపడింది.

నీతి

మంచివారితో చేసే స్నేహం ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది. అలాగే పెద్దలు చెప్పే మంచి మాటలను వినకపోతే మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. మంచి స్నేహం ఎప్పుడూ ఆపదలో అండగా నిలుస్తుంది. ఇతరులకు చేసిన మేలు ఎప్పటికైనా మనకు తిరిగి సహాయం చేస్తుంది. అలాగే పెద్దలు చెప్పే మంచి మాటలను గౌరవించి వినాలి; లేకపోతే మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

Follow Us