AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Milk: మీరు తాగే పాలు అమృతమా.. కెమికల్స్ విషమా?.. ఇంట్లోనే నిమిషాల్లో కల్తీని పట్టుకునే టెస్టులు ఇవే!

మన దేశంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఇంట్లోనూ పాలు అత్యంత ప్రధానమైన ఆహారంగా మారిపోయాయి. ముఖ్యంగా చిన్న పిల్లల ఎదుగుదలకు, వృద్ధుల ఆరోగ్యానికి పాలను మనం సంపూర్ణ పోషకాహారంగా నమ్ముతాము. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు లాభాల కోసం పాలను విపరీతంగా కల్తీ చేస్తున్నారు.

Toxic Milk: మీరు తాగే పాలు అమృతమా.. కెమికల్స్ విషమా?.. ఇంట్లోనే నిమిషాల్లో కల్తీని పట్టుకునే టెస్టులు ఇవే!
How To Check Milk Purity At Home
Bhavani
|

Updated on: Jul 18, 2026 | 8:37 PM

Share

పాలలో కేవలం నీళ్లు కలపడమే కాకుండా.. అవి చిక్కగా, తెల్లగా నురగతో కనిపించడం కోసం యూరియా, డిటర్జెంట్, గంజి పొడి, కాస్టిక్ సోడా వంటి భయంకరమైన కెమికల్స్‌ను వాడుతున్నారు. ఇవి దీర్ఘకాలంలో కిడ్నీలు దెబ్బతినడానికి, పేగుల్లో అల్సర్లు రావడానికి కారణమవుతాయి. మరి మనం కొనే పాలు ఎంతవరకు సురక్షితమైనవో తెలుసుకోవడానికి ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. వంటింట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లో పాల స్వచ్ఛతను పరీక్షించే సులభమైన చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

మన ఇంటికి వచ్చే పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కొన్ని సులభమైన గృహ పరీక్షలను సూచించింది. పాలలో నీటి కల్తీని కనిపెట్టడానికి ఒక నునుపైన టైల్ లేదా గాజు ప్లేట్‌ను కాస్త వాలుగా ఉంచి, దానిపై ఒక చుక్క పాలను వేయాలి. పాలు గనుక స్వచ్ఛమైనవి అయితే ఆ చుక్క చాలా నెమ్మదిగా కిందకు జారుతూ తన వెనుక స్పష్టమైన తెల్లటి గీతను వదిలివెళ్తుంది. ఒకవేళ నీళ్లు కలిపితే ఆ చుక్క ఎటువంటి మార్కును వదలకుండా వేగంగా కిందికి జారిపోతుంది.

అలాగే పాలలో సబ్బుపొడి లేదా డిటర్జెంట్ కలిపారో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న బాటిల్లో కొద్దిగా పాలు, అంతే పరిమాణంలో నీటిని పోసి గట్టిగా ఊపాలి. స్వచ్ఛమైన పాలకైతే చాలా తక్కువ నురగ వచ్చి కొద్ది సెకన్లలోనే మాయమైపోతుంది. అదే డిటర్జెంట్ కలిపిన పాలైతే షాంపూ లాగా మందపాటి నురగ ఏర్పడి చాలా సేపటి వరకు అలాగే ఉండిపోతుంది.

ఇక పాలు చిక్కగా కనిపించడం కోసం గంజిపొడి లేదా పిండి పదార్థాలు కలిపినట్లు అనుమానం వస్తే, పాలను మరిగించి చల్లార్చిన తర్వాత అందులో రెండు మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. పాలు గనుక దట్టమైన నీలం లేదా వైలెట్ రంగులోకి మారితే అందులో గంజిపొడి కలిపినట్లు అర్థం.

మరో ప్రమాదకరమైన కల్తీ యూరియాను గుర్తించడానికి ఒక కప్పు పాలలో అర చెంచా సోయాబీన్ పొడి లేదా కందిపొడి వేసి బాగా కలిపి, ఐదు నిమిషాల తర్వాత ఎరుపు లిట్మస్ పేపర్‌ను అందులో ముంచాలి. పాలలో యూరియా ఉంటే ఆ ఎరుపు రంగు లిట్మస్ పేపర్ వెంటనే నీలం రంగులోకి మారిపోతుంది.

చివరగా, ఆవు లేదా గేదె ప్రమేయం లేకుండా కేవలం కెమికల్స్‌తో తయారుచేసే సింథటిక్ పాలను గుర్తించడానికి కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి. ఈ పాలను వేళ్ల మధ్య వేసి రుద్దినప్పుడు సబ్బు లాగా జిగటగా అనిపిస్తాయి. తాగినప్పుడు కొద్దిగా చేదు రుచి తగులుతుంది. అంతేకాకుండా, స్వచ్ఛమైన పాలను మరిగిస్తే తెల్లగానే ఉంటాయి కానీ, ఇలాంటి సింథటిక్ పాలను మరిగించినప్పుడు అవి లేత పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ చిన్న చిట్కాలతో పాల కల్తీని సులభంగా గుర్తించి మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ గైడ్‌లైన్స్, ఆహార విశ్లేషకులు మరియు గృహోపకరణాల నిపుణుల సాధారణ చిట్కాల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. ఈ హోమ్ టెస్టులు ప్రాథమిక గుర్తింపు కోసం మాత్రమే ఉపయోగపడతాయి. పాలు తీవ్రంగా కల్తీ అయ్యాయని బలమైన అనుమానం ఉంటే, ఖచ్చితమైన ఫలితాల కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీకి పంపి పరీక్షించడం శ్రేయస్కరం.

Follow Us