ఆరోగ్యం, అదృష్టం మీ సొంతం కావాలంటే ఏ సమయంలో నిద్ర లేవాలి! ఆ సీక్రెట్ టైమ్ గురించి తెలుసా
ప్రస్తుత ఆధునిక కాలంలో అర్ధరాత్రి వరకు మేల్కొనడం, మరుసటి రోజు ఆలస్యంగా నిద్రలేవడం చాలామందికి అలవాటుగా మారింది. ఆఫీస్ పనులు, నైట్ లైఫ్ బాగా అలవాటైన నేటి కాలం వారికి. కానీ మన పూర్వీకులు, రుషులు తెల్లవారుజామునే నిద్రలేవాలని ఎందుకు చెప్పేవారో ఎప్పుడైనా ఆలోచించారా?

ఏ పని చేసినా విజయం లభించాలన్నా, శరీరం రోగాల బారిన పడకుండా ఉండాలన్నా ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయాన్నే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ సమయంలో మేల్కొంటే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అపారమైన జ్ఞానం మరియు దైవిక శక్తి కూడా లభిస్తాయని నమ్ముతారు. అదే ‘బ్రహ్మ ముహూర్తం’. అసలు ఉదయం 4:00 నుండి 5:30 గంటల మధ్య కాలంలో ఏం జరుగుతుంది? ఆ సమయంలో నిద్రలేవడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బ్రహ్మ ముహూర్తం అంటే..
హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పిలుస్తారు. అంటే దాదాపు ఉదయం 4:00 గంటల నుండి 5:30 గంటల వరకు ఉండే ఈ సమయం జ్ఞానానికి అధిపతి అయిన బ్రహ్మ దేవుడికి అంకితం చేయబడింది. ఆ సమయంలో ప్రకృతి అత్యంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో మేల్కొనడం వల్ల మన శరీరంలోని ‘జీవ గడియారం’ సరిగ్గా రీఛార్జ్ అవుతుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన దినచర్యకు పునాది వేస్తుంది.
మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు..
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల మనస్సుపై సానుకూల ప్రభావం పడుతుంది. ఉదయం పూట శబ్ద కాలుష్యం తక్కువగా ఉండటం వల్ల ఏకాగ్రత, సృజనాత్మకత పదింతలు పెరుగుతాయి. చదువుకునే విద్యార్థులకు ఇది అత్యంత అనువైన సమయం. ప్రశాంతమైన వాతావరణం వల్ల మనసులోని ఆందోళనలు, ఒత్తిడి మాయమై ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం, ప్రార్థన, యోగా వంటి పనులు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో చేసే ప్రార్థనలు దైవిక శక్తితో మనల్ని త్వరగా అనుసంధానం చేస్తాయని, ఆత్మజ్ఞానం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
తెల్లవారుజామున గాలిలో ఓజోన్ మరియు ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల రోజంతా ఉల్లాసంగా, తాజాగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఈ సమయంలో మేల్కొంటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుందని, శరీరంలో హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు.
ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో, వారికి మిగిలిన వారికంటే రోజూ 2 నుండి 3 గంటల అదనపు సమయం దొరుకుతుంది. ఈ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం వల్ల వృత్తిపరమైన పనుల్లో విజయం సాధించవచ్చు. ఇది మనలో ఒక తెలియని క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పరిపూర్ణ జీవన విధానం. ప్రకృతితో కలిసి ప్రయాణించడం వల్ల శారీరక, మానసిక వికాసం కలుగుతుంది.
