‘రిచ్ డాడ్..పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి జీవితాన్నే మార్చేసిన భారతీయ గురువు.. ఎవరో తెలుసా
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక సూత్రాలు నేర్పిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి జీవితంలో అద్భుతమైన మలుపు వెనుక భారతీయుడి హస్తం ఉందంటే నమ్ముతారా? కేవలం ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్న ఆయన్ను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించి, జీవిత పరమార్థాన్ని బోధించిన ఆ అజ్ఞాత గురువు కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక సంక్షోభాలను ముందుగానే ఊహించే రాబర్ట్ కియోసాకి, ఇప్పుడు సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు. ఒకప్పుడు కేవలం లాభాలు, వ్యాపారాల చుట్టూ తిరిగిన తన ఆలోచనలను, ఒక భారతీయ గురువు చెప్పిన మాటలు ఎలా మార్చాయో వివరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఆసక్తికర పరిణామం..
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ గురించి తెలియని వారుండరు. దీని రచయిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించే మాట్లాడుతుంటారు. అయితే, ఇలాంటి ఆర్థిక నిపుణుడు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత గురించి, జీవిత పరమార్థం గురించి మాట్లాడటం నిజంగానే ఆసక్తికరమైన పరిణామం.
ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక మొమొరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. ఒక భారతీయ గురువు చెప్పిన మాటలు తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయో వెల్లడించారు.
టార్గెట్ అది కాదు..
చాలా సంవత్సరాల క్రితం ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువును కలిసినప్పుడు ఆయన ఒక అద్భుతమైన సూత్రాన్ని కియోసాకికి చెప్పారు. “నీ ఆత్మ యొక్క లక్ష్యాలను నెరవేర్చడమే నీ శరీరం అసలైన విధి” అని ఆ గురువు తెలిపారు. ఆ సమయంలో కియోసాకి కేవలం వ్యాపారాలు చేయడం, విపరీతంగా డబ్బు సంపాదించడంలోనే బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆ గురువు చెప్పిన అంతరార్థాన్ని పూర్తిగా గ్రహించడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని కియోసాకి అంగీకరించారు. ఒక దశలో తన ఆత్మ యొక్క అసలైన లక్ష్యం కేవలం సంపదను కూడబెట్టడం కాదని, సమాజానికి ఉపయోగపడేలా ఆర్థిక విద్యను అందించడమేనని తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి గొప్ప నాయకుల స్ఫూర్తితో మానవాళికి సేవ చేయడమే పరమార్థంగా భావించారు. మొదట్లో ఉచితంగా ఆర్థిక పాఠాలు చెప్పడం ప్రారంభించిన కియోసాకి, కాలక్రమేణా దాన్ని మల్టీ-మిలియన్ డాలర్ల అంతర్జాతీయ విద్యా సంస్థగా మార్చగలిగారు. డబ్బు వెనుక పరిగెత్తడం కంటే, సమాజానికి విలువైన సేవలను అందించినప్పుడే నిజమైన ఆర్థిక విజయం ఒక బై-ప్రొడక్ట్‌గా వెతుక్కుంటూ వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
ధనం సంపాదించడం కంటే జీవితంలో ఒక ఉన్నతమైన ఆశయాన్ని కలిగి ఉండటం ముఖ్యమని ఈ సంఘటన నిరూపిస్తోంది. భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక చింతన ఒక ప్రపంచ స్థాయి సంపన్నుడి జీవితంలో ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందో కియోసాకి మాటల్లో స్పష్టమవుతోంది. వ్యాపార సామ్రాజ్యాల సృష్టికర్తగా పేరొందిన ఆయన, ఇప్పుడు సమాజ హితమే పరమార్థమని చాటిచెప్పడం విశేషం.
