Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున ఏమి తినాలి..? ఏమి తినకూడదో తెలుసా..?
అది చంద్రగ్రహణం అయినా.. సూర్యగ్రహణం అయినా.. జ్యోతిష్యం పరంగా చాలా నియమాలు ఉన్నాయి. ప్రజలు వీటిని తప్పక పాటిస్తారు. గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. కానీ పురాతన కాలం నుంచే దాని చుట్టూ నమ్మకాలు ఏర్పడ్డాయి. కాబట్టి చంద్రగ్రహణం రోజున ఏమి తినాలి..? ఏం తినకూడదు అనే విషయాలను తెలుసుకుందాం..

ఆదివారరం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. ఆ రోజున సంభవించే చంద్రగ్రహణాన్ని “బ్లడ్ మూన్” అని పిలుస్తారు. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ గ్రహణం మన దేశంతో సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
గ్రహణం సూతక కాలం వివరాలు
చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగుతుంది. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. ఈ చంద్రగ్రహణానికి సూతక కాలం ఉంటుంది. ఇది గ్రహణానికి 9 గంటల ముందు అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పటి నుండి కొన్ని నియమాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది.
గ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు
పురాతన నమ్మకాల ప్రకారం.. గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకూడదని, పదునైన వస్తువులను తాకకూడదని, కూరగాయలు కోయకూడదని, వండకూడదని, తినకూడదని చెబుతారు. ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, ప్రజలు వీటిని పాటిస్తుంటారు.
ఆహార నియమాలు
గ్రహణం రోజున ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అనే దానిపై కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
తినవలసినవి: సాత్విక ఆహారాలైన కూరగాయలు, చపాతీలు, అన్నం తినవచ్చు. వంటల్లో పసుపు వాడటం మంచిదని చెబుతారు.
తినకూడనివి: మాంసాహారం, బ్రెడ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుల్లని ఆహారాలు, మద్యం వంటివి తీసుకోకూడదని చెబుతారు.
తులసి ఆకుల ప్రాముఖ్యత
గ్రహణం సమయంలో ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. దీన్ని నివారించడానికి తినే నీరు లేదా ఆహార పదార్థాలలో కొన్ని తులసి ఆకులను వేయడం మంచిదని చెబుతారు. తులసి ఆకులకు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే గుణం ఉందని నమ్ముతారు. గ్రహణం రోజున సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలని, ఉపవాసం ఉండటం మంచిదని చెబుతారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసి, పూజ చేసి, ఆ తర్వాతే భోజనం చేయాలని సంప్రదాయాలు చెబుతున్నాయి. ఆరోగ్య పరంగా చూస్తే, గ్రహణం రోజున మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




