AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అసలు సమస్య మీ పొట్టలోనే ఉందేమో చెక్ చేసుకోండి..

ఎన్ని రకాల కాస్ట్లీ ఆయిల్స్, షాంపూలు వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే అసలు సమస్య మీ జుట్టులో కాదు.. మీ కడుపులో ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. పొట్ట ఆరోగ్యం సరిగ్గా లేకపోతే జుట్టు ఊడిపోతుందా? శాస్త్రవేత్తలు చెబుతున్న గట్ హెయిర్ యాక్సిస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అసలు సమస్య మీ పొట్టలోనే ఉందేమో చెక్ చేసుకోండి..
Gut Health Hair Growth LinkImage Credit source: Pinterest
Krishna S
|

Updated on: Aug 06, 2026 | 4:25 PM

Share

జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎన్ని రకాల షాంపూలు, ఆయిల్స్ మార్చినా ఫలితం కనిపించడం లేదా? అయితే సమస్య మీ జుట్టులో కాదు.. మీ పొట్టలో ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. ఆయుర్వేదంలో పూర్వం నుంచే జీర్ణక్రియకు, జుట్టు ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తున్నారు. తాజాగా ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని గట్ హెయిర్ యాక్సిస్ అని పిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన జుట్టుకు, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఉన్న సంబంధంపై కాన్పూర్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ సాద్ అన్వర్ కీలక విషయాలు వెల్లడించారు.

జీర్ణ సమస్యలు ఉన్నాయా? అయితే జుట్టు ఊడటం ఖాయం

మన జుట్టు కుదుళ్లు నిరంతరం చాలా చురుగ్గా పనిచేస్తుంటాయి. జుట్టు బలంగా పెరగడానికి శరీరానికి తగినంత ఐరన్, జింక్, ప్రొటీన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు చాలా అవసరం. అయితే మనం ఎంత పోషకాహారం తిన్నా, మన జీర్ణవ్యవస్థ వాటిని సరిగ్గా గ్రహించలేకపోతే ఫలితం ఉండదు.

డాక్టర్ సాద్ అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం..

  • సెలియాక్ డిసీజ్
  • ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్
  • దీర్ఘకాలిక గ్యాస్ట్రైటిస్
  • జీర్ణశయాంతర వాపు

వంటి సమస్యలు ఉన్నవారిలో శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి విపరీతంగా జుట్టు రాలడం, పలచబడటం, జుట్టు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

జీర్ణకోశ బ్యాక్టీరియా పాత్ర ఏంటి?

మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా కేవలం అరుగుదలకు మాత్రమే పరిమితం కాదు. అవి శరీరంలో వాపులు తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మానసిక ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవన్నీ పరోక్షంగా జుట్టు పెరిగే లైఫ్ సైకిల్‌ను ప్రభావితం చేస్తాయి.

ప్రోబయోటిక్స్ వాడితే జుట్టు పెరుగుతుందా?

చాలామంది జీర్ణక్రియ అనగానే ప్రోబయోటిక్స్ టాబ్లెట్లు లేదా సిరప్‌లు వాడటం మొదలుపెడతారు. కానీ కేవలం ప్రోబయోటిక్స్ లేదా గట్ బ్యాక్టీరియాను పెంచడం ద్వారా జుట్టు రాలడాన్ని పూర్తిగా నిరోధించవచ్చని చెప్పడానికి ఇంకా తగినంత శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ అన్వర్ హెచ్చరించారు. గట్ హెయిర్ యాక్సిస్ అనేది వైద్యరంగంలో ఒక కొత్త పరిశోధనాంశమని ఆయన స్పష్టం చేశారు.

ఏం చేయాలి? ఏ టెస్టులు చేయించుకోవాలి?

అకారణంగా లేదా దీర్ఘకాలంగా జుట్టు విపరీతంగా రాలుతుంటే సొంత వైద్యం లేదా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్, హెయిర్ సప్లిమెంట్స్ పై మాత్రమే ఆధారపడకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన కారణాన్ని గుర్తించాలి.

డాక్టర్ల సలహా మేరకు ఈ క్రింది పరీక్షలు చేయించుకోవడం మంచిది..

  • సిబిసి
  • ఐరన్ – ఫెర్రిటిన్ లెవల్స్
  • విటమిన్ B12, విటమిన్ D3, జింక్ స్థాయిలు
  • థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్
  • హార్మోన్ ప్రొఫైల్
  • సెలియాక్ – ఇతర గ్యాస్ట్రో సమస్యల స్క్రీనింగ్

జుట్టు రాలడం అనేది కేవలం సౌందర్య సమస్య కాదు.. అది మీ శరీరంలో ఉన్న పోషకాల లోపానికి లేదా జీర్ణవ్యవస్థ లోపానికి సంకేతం కావచ్చు. కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స తీసుకోవడమే హెయిర్ ఫాల్‌కి శాశ్వత పరిష్కారం.

Follow Us