Palak Paneer Controversy: వార్నీ.. పాలక్ పనీర్ ఎంత పని చేసింది! ఈ ‘కూర’ గొడవ ఏకంగా కోటిన్నర తెచ్చిపెట్టింది!
మనం తినే ఆహారం మన సంస్కృతికి చిహ్నం. కానీ అదే ఆహారం విదేశీ గడ్డపై అవమానానికి గురైతే? అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ఇద్దరు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వారు తెచ్చుకున్న 'పాలక్ పనీర్' వాసన వస్తోందంటూ యూనివర్సిటీ సిబ్బంది చేసిన హేళనపై ఆ విద్యార్థులు న్యాయపోరాటం చేశారు. ఏకంగా రూ.1.8 కోట్ల పరిహారాన్ని గెలుచుకుని, భారతీయ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారు.

అమెరికాలో వివక్షకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు సంచలన విజయం సాధించారు. యూనివర్సిటీ కిచెన్‌లో భారతీయ వంటకాలను వేడి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దక్షిణ ఆసియా విద్యార్థుల పట్ల అసహనం ప్రదర్శించిన యాజమాన్యానికి కోర్టు గట్టి బుద్ధి చెప్పింది. ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య అనే ఇద్దరు పరిశోధక విద్యార్థులు తమ పౌర హక్కుల కోసం పోరాడి విజేతలుగా నిలిచిన స్ఫూర్తిదాయక కథనం ఇది.
వివాదం ఎక్కడ మొదలైంది? 2023 సెప్టెంబర్‌లో కొలరాడో యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆదిత్య ప్రకాష్ తన లంచ్ బాక్స్‌లో తెచ్చుకున్న ‘పాలక్ పనీర్’ను యూనివర్సిటీ మైక్రోవేవ్‌లో వేడి చేస్తుండగా, అక్కడి సిబ్బంది అది దుర్వాసన వస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆహారం మాత్రమేనని ఆదిత్య వివరించినప్పటికీ, ఆ తర్వాత వరుసగా వివక్షాపూరిత చర్యలు మొదలయ్యాయి.
ఎదుర్కొన్న సమస్యలు:
కిచెన్ నిబంధనల పేరుతో దక్షిణ ఆసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అవమానించారు. ఎటువంటి కారణం లేకుండానే ఊర్మి భట్టాచార్యను టీచింగ్ అసిస్టెంట్ పదవి నుంచి తొలగించారు. పాలక్ పనీర్ ఘటన తర్వాత విద్యార్థులను రెచ్చగొట్టేలా యూనివర్సిటీ వర్గాలు ప్రవర్తించాయి.
న్యాయస్థానంలో విజయం: తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఈ ఇద్దరు విద్యార్థులు అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో పౌరహక్కుల దావా వేశారు. సుమారు రెండేళ్ల పాటు సాగిన ఈ పోరాటంలో కోర్టు విద్యార్థుల పక్షాన నిలిచింది. దీంతో 2025 సెప్టెంబర్‌లో యూనివర్సిటీ 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.8 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే వారికి మాస్టర్స్ డిగ్రీలను ప్రదానం చేసింది.
తీర్పు వెలువడిన తర్వాత, యూనివర్సిటీ ఈ విద్యార్థులపై భవిష్యత్తులో తిరిగి ప్రవేశం లేకుండా నిషేధం విధించింది. దీంతో 2026 జనవరిలో ఈ జంట ఇండియాకు తిరిగి వచ్చారు. “మా రంగు, భాష, ఆహారం ఏదైనా సరే.. వివక్షకు వ్యతిరేకంగా మేము చేసిన యుద్ధంలో విజయం సాధించాం” అని వారు గర్వంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
