
చేపలలో శరీరానికి ముఖ్యమైన పోషకాలు చాలా ఉన్నాయి. చేపలలో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అనేక ఇతర ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే, కొంతమంది చేపలలోని ముళ్ళ కారణంగా వాటిని తినడానికి భయపడతారు. కొన్నిసార్లు ఈ చిన్న ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. మీరు కూడా చేప ముల్లు గొంతుల్లో ఇరుక్కుపోవడం సమస్యను ఎదుర్కొని ఉంటారు. వైద్యుడి వద్దకు వెళ్లే ముందు కొన్ని ఇంటి నివారణలను ట్రై చేయండి. దీంతో ముల్లు వెంటనే బయటకు వచ్చేస్తుంది.
మీరు ఇంట్లో తయారుచేసిన చేపలను రోటీ, లేదంటే, అన్నంతో తింటారు. కానీ, అకస్మాత్తుగా ఒక చేప ముల్లు మీ గొంతులో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితిలో, భోజనం ఆనందం మొత్తం సెకన్లలో నాశనమవుతుంది. అందుకే కొంతమంది చేప ముల్లుకు భయపడి తినకుండా ఉంటారు. గొంతులో ఇరుక్కుపోయిన చేప ముల్లును ఎలా తొలగించాలో తెలియక ఆందోళన పడుతుంటారు. గొంతులో ఇరుక్కుపోయిన ముల్లు నొప్పిని కలిగిస్తుంది. అలాంటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ మీకు తక్షణ పరిష్కారంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
మెత్తటి బ్రెడ్ తినటం వల్ల లేదంటే, అన్నం ముద్దగా చేసుకుని మింగడం ద్వారా ముల్లును తొలగించవచ్చు. ఈ నివారణ ప్రభావవంతంగా ఉంటుంది. లేదంటే, గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే బలంగా దగ్గడానికి ప్రయత్నించండి. ఇలా బలంగా దగ్గుతూ ఉంటే ముల్లు బలవంతంగా బయటకు వస్తుంది.
గొంతులో ఇరుక్కుపోయిన చేప ముల్లును తీసేందుకు మరో మార్గం బాగా పండిన అరటి పండు. మీ గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే, పండిన అరటిపండు తినాలి. ఒక పెద్ద అరటిపండును తింటూ, నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచుకోవాలి. కొన్ని సెకన్ల పాటు అదంతా నోటిలో అలాగే పట్టుకుని ఉండాలి. నెమ్మదిగా మీరు అరటిపండును మింగినప్పుడు చేప ముల్లు కూడా అరటిపండుతో పాటు మీ గొంతులోకి జారుతుంది.
మరోక విధానంలో ఒక బ్రెడ్ ముక్కను గోరువెచ్చని నీటిలో లేదా పాలలో ముంచి, బాగా కలిపి తాగేయాలి. పాలలోని లూబ్రికెంట్ లేదా బ్రెడ్ నుండి వచ్చే నీరు ముల్లును మీ గొంతు నుండి మీ కడుపులోకి నెట్టివేస్తుంది.
గోరువెచ్చని నీరు తాగాలి: గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాలలో లోతుగా ఇరుక్కుపోయిన చిన్న ముల్లును కూడా సులభంగా తొలగించవచ్చు. ఎందుకంటే వెచ్చని లేదా గోరువెచ్చని నీరు కండరాలను సడలిస్తుంది. ఇది ముల్లు కిందికి జారడానికి సహాయపడుతుంది.
తేనె తినడం ద్వారా కూడా గొంతులో ఇరుక్కున్న చేప ఎముక తొలగించవచ్చు. తేనె ఎముకను సడలించడానికి సహాయపడుతుంది. దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎముక వల్ల కలిగే వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్‌ను కూడా తగ్గిస్తాయి. మీకు కావాలంటే, పెప్సి, కోక్ మొదలైన కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగొచ్చు. కొన్నిసార్లు ఇది మీ గొంతులో ఇరుక్కున్న చేప ఎముకను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఈ చిట్కాలు, ఇంటి నివారణలు ప్రయత్నించినప్పటికీ ముల్లు అలాగే ఉండిపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆలస్యం చేయటం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గొంతు నొప్పి, వాపు ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..