మీ ఇంటిని ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంచాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..!
వంటగదిలో చెత్త డబ్బా శుభ్రంగా లేకపోతే దుర్వాసన ఇంటి నిండా వ్యాపిస్తుంది. ముఖ్యంగా తడి చెత్త వల్ల వచ్చే వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ భయపడాల్సిన పని లేదు. ఇంట్లోనే సులువుగా దొరికే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు మీ వంటగదిని శుభ్రంగా, సువాసనతో ఉంచడానికి సహాయపడతాయి.

వంటగదిలో చెత్త డబ్బా శుభ్రంగా లేకపోతే.. దాని వాసన ఇల్లంతా పాకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తడి చెత్త, కూరగాయల తొక్కలు, టీ పొడి లాంటివి ఎక్కువసేపు ఉండిపోతే భయంకరమైన దుర్వాసన వస్తుంది. అందువల్ల వంటగదిలో శుభ్రతను కాపాడుకోవడం చాలా అవసరం.
చెత్తను రోజూ తీసేయండి
తడి చెత్తను ఒకరోజు కంటే ఎక్కువ చెత్త డబ్బాలో ఉంచితే అది పాడై, దుర్వాసన రావడం మొదలవుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకసారి చెత్తను తీసేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే చెత్త డబ్బా మూత తెరిచి ఉంచితే వాసన వ్యాపిస్తుంది. కాబట్టి మూతను ఎప్పుడూ మూసి ఉంచడం మంచిది.
వారానికోసారి మస్ట్
చెత్తను తీసేయడం మాత్రమే సరిపోదు. చెత్త డబ్బాను కూడా వారానికి కనీసం ఒకసారి శుభ్రంగా కడగాలి. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్ కలిపి ఆ నీటితో చెత్త డబ్బా పూర్తిగా కడగండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోతుంది.
పేపర్ తో తేమకు చెక్
చెత్త డబ్బాలో తడి పదార్థాల తేమను పీల్చుకోవడానికి.. డబ్బా అడుగున పాత వార్తాపత్రిక లేదా బ్రౌన్ షీట్ కాగితాన్ని పరచండి. దీని పైన పాలిథిన్ కవర్ వేసి ఆ తర్వాత చెత్తను వేయండి. ఇది చెత్తలోని తేమను లాక్కొని.. నెమ్మదిగా ఆరిపోయేలా చేస్తుంది.
బేకింగ్ సోడాతో దుర్వాసనకు చెక్
ప్రతిసారి చెత్త వేసే ముందు చెత్త డబ్బా అడుగున 1 నుంచి 2 స్పూన్ల బేకింగ్ సోడాను చల్లండి. ఇది తేమను గ్రహించి.. దుర్వాసన రాకుండా ఆపుతుంది. సులభంగా దొరికే ఇది.. వంటగదిలో మంచి వాసన ఉండేలా చేస్తుంది.
సువాసన కోసం
నిమ్మకాయ తొక్కలు ఎండబెట్టి వాటిని చెత్త డబ్బాలో వేసుకోవచ్చు. అలాగే లావెండర్, టీ ట్రీ, నిమ్మ నూనెలు.. వీటిని కొన్ని చుక్కలు టిష్యూ పేపర్‌పై వేసి డబ్బా లోపల లేదా మూతకు అంటించాలి. ఇవి నెమ్మదిగా మంచి సువాసనను విడుదల చేస్తూ.. దుర్వాసనను నివారిస్తాయి.
ఫ్రెష్ స్మెల్ కోసం
ఒక నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి వాటిపై కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా చల్లి, చెత్త డబ్బా దగ్గర ఉంచండి. ఇది సహజంగా వాసనను పీల్చుకుంటూ తాజా నిమ్మకాయ వాసనను చల్లగా వ్యాపింపజేస్తుంది.
ఈ చిట్కాలను పాటిస్తే వంటగదిలో దుర్వాసన లేకుండా ఉంచుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా చేయగలిగిన ఈ సహజ పద్ధతులు ఖర్చు తక్కువగా ఉండి.. మంచి ఫలితం ఇస్తాయి. శుభ్రతను పాటిస్తే వంటగది మాత్రమే కాదు.. ఇంటి మొత్తం మంచి వాతావరణం ఏర్పడుతుంది.




