పూజలో వాడే ఈ వస్తువుతో పాములు పారిపోతాయని మీకు తెలుసా..?
వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వీటన్నింటి కన్నా ఒక సహజమైన, చవకైన, ప్రభావవంతమైన మార్గం ఉందని మీకు తెలుసా..? దీని కోసం దేవునికి సమర్పించే పండు తొక్క మాత్రమే అవసరం. ఆ పండు గురించి తెలుసుకుందామా మరి..

పూజలలో, ప్రతి శుభకార్యంలో మొదటగా కొబ్బరికాయను సమర్పిస్తారు. దీన్ని శ్రీఫలం అంటే లక్ష్మీదేవి పండు అని కూడా పిలుస్తారు. అయితే పూజ తర్వాత కొబ్బరి తొక్క (పీచు) ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలుసా..? ఇది కేవలం వ్యర్థం కాదు.. ఇంట్లోకి పాముల వంటి ప్రమాదకర జంతువులు రాకుండా చూసే ఒక సహజ పద్ధతి. వర్షాకాలంలో ఇంట్లోకి పాములు వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండటానికి మీరు కొబ్బరి పీచును ఉపయోగించవచ్చు.
ఎలా పని చేస్తుంది..?
పాములను తరిమేందుకు చాలా మంది ఖరీదైన, హానికరమైన రసాయనాలను వాడతారు. కానీ కొబ్బరి పీచు పద్ధతి చాలా చవకగా ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి పీచు నుంచి వచ్చే వాసన మనకు పెద్దగా అనిపించకపోయినా.. పాములకు వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉండటంతో వాటికి ఆ వాసన అసహ్యం కలిగిస్తుంది. పాములకు ఈ వాసన నచ్చదు. అందుకే అవి దూరంగా ఉండటానికి ఇష్టపడతాయి.
వాడే విధానం
కొబ్బరి తొక్క పొడిగా, పీచుతో ఉండటం వల్ల పాములకు దానిపై వెళ్లడం అసౌకర్యంగా ఉంటుంది. దానిపై అవి సులభంగా జారలేవు. మీరు పొడిగా ఉన్న కొబ్బరి తొక్కను తలుపుల అంచుల వద్ద, తోట దగ్గర, గేటు మూలల వద్ద, వెనుక తలుపు వద్ద లేదా పందిరి మూలలలో పెట్టవచ్చు.
ఎలా ఉపయోగించాలి..?
ఒక పొడి కొబ్బరికాయ తీసుకుని దాని పీచు భాగాన్ని వేరు చేయండి. దానిని 3 నుంచి 4 ముక్కలుగా చేసి పాములు వచ్చే అవకాశం ఉన్న తలుపుల మూలలు, తోట దారులు, కిటికీ దగ్గర లేదా అవసరమైన చోట పెట్టండి. వాసన పోకుండా ఉండటానికి ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి మార్చండి.
కాల్చే పద్ధతి కూడా..
సాయంత్రం లేదా రాత్రి పొడిగా ఉన్న కొబ్బరి పీచును కాల్చవచ్చు. దీన్ని ఒక పాత ప్లేట్ లో లేదా మట్టి పాత్రలో పెట్టి కాల్చండి. దాని నుంచి వచ్చే పొగ, వాసన సహజంగా వ్యాపించి పాములను తరిమేస్తుంది. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశంలో పొగ వేయవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- కొబ్బరి పీచును కాల్చేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచండి. త్వరగా అంటుకునే పదార్థాల దగ్గర కాల్చకండి.
- వర్షం పడి పీచు తడిగా అయితే దానిని మళ్ళీ పొడిగా మార్చండి.
- ఎల్లప్పుడూ బయట లేదా గాలి బాగా ఉండే ప్రదేశంలోనే కాల్చండి.
ఈ చిట్కా మీ ఇంటిని పాముల నుంచి కాపాడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంట్లో విషపూరితమైన పాము కనిపిస్తే ప్రమాదం జరగకుండా ఉండాలంటే వెంటనే పాములను పట్టే నిపుణులను లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వడం మంచిది.




