ఎన్నిరోజులైన నిమ్మకాయలు ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..
మార్కెట్ నుంచి తాజాగా తెచ్చిన నిమ్మకాయలు రెండు మూడు రోజులకే ఎండిపోయి గట్టిపడుతున్నాయా..? లేదా సగం కోసి ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయ రుచి మారిపోయి వృధా అవుతోందా..? ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే ఈ సమస్యకు చాలా సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. నిమ్మకాయలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకుండా, ఒక చిన్న మార్పు చేసి నిల్వ ఉంచితే నెలల తరబడి అవి అప్పుడే కోసినంత తాజాగా, రసవంతంగా ఉంటాయి. ఆ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

మన వంటగదిలో నిమ్మకాయ లేనిదే ఏ పని పూర్తి కాదు. కూరలకు రుచిని పెంచడం దగ్గర నుంచి వేసవిలో చల్లని పానీయాల తయారీ వరకు నిమ్మకాయను విస్తృతంగా ఉపయోగిస్తాం. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజులకే ఎండిపోయి గట్టిపడటం, లేదా సగం కోసి ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయ రుచి మారిపోయి పాడైపోవడం వంటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఎదురవుతుంటాయి. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా, రసవంతంగా ఉంచుకోవచ్చు. అవును.. నిమ్మకాయలను బయట గది ఉష్ణోగ్రత వద్ద వదిలేస్తే, వాటిలోని తేమ శాతం తగ్గిపోయి సుమారు ఒక వారంలోనే ఎండిపోవడం మొదలవుతుంది. అందుకే ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు కొనుగోలు చేసినప్పుడు వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది. ఒకవేళ నిమ్మకాయలు ఇంకా పచ్చిగా ఉంటే, అవి పసుపు రంగులోకి మారే వరకు బయట ఉంచి, ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
నేరుగా కాకుండా డబ్బాలో పెట్టండి
చాలామంది నిమ్మకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే నేరుగా ఫ్రిజ్ రాక్‌లో పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లోని చల్లని గాలికి నిమ్మకాయ తొక్క ఎండిపోతుంది. అలా కాకుండా నిమ్మకాయలను గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వాటిలోని సహజ తేమ నిలిచి ఉండి, చాలా కాలం పాటు రసవంతంగా ఉంటాయి.
సగం కోసిన నిమ్మకాయ పాడవ్వకూడదంటే
వంట చేసేటప్పుడు సగం నిమ్మకాయ వాడి, మిగిలిన సగం పక్కన పెట్టేస్తుంటాం. దాన్ని అలా తెరిచి ఉంచితే కోసిన భాగం త్వరగా ఎండిపోయి పనికిరాకుండా పోతుంది. అలా జరగకూడదంటే మిగిలిన నిమ్మకాయ చెక్కను ప్లాస్టిక్ ర్యాప్‌తో గట్టిగా చుట్టి లేదా ఒక చిన్న మూత ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా నిల్వ చేసిన ముక్కలను రెండు మూడు రోజుల్లోపు వాడుకోవడం ఉత్తమం.
నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్స్‌లా నిల్వ చేయండి
నిమ్మకాయలు పాడైపోతాయని అనిపించినా, లేదా ఎప్పటికప్పుడు రసం పిండే సమయం లేకపోయినా వాటి రసాన్ని తీసి నిల్వ చేసుకోవచ్చు. నిమ్మరసాన్ని పిండి ఒక శుభ్రమైన సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెడితే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి ఫ్రీజర్‌లో గడ్డకట్టించండి. క్యూబ్స్ తయారయ్యాక వాటిని ఒక డబ్బాలో వేసి ఫ్రీజర్‌లో ఉంచుకుంటే, అవసరమైనప్పుడు ఒక్కో క్యూబ్ తీసి వాడుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే నిమ్మకాయలు వృధా కాకుండా ఉండటమే కాకుండా, మీ వంటగదిలో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి!
