Memory Power: ఈ పొరపాట్లే మీ పిల్లల మెమరీ పవర్‌ను దెబ్బతీస్తున్నది.. సైన్స్ చెప్తున్న టిప్స్ ఇవే
మీ పిల్లలు ఎక్కాలు లేదా పాఠాలు గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీకో శుభవార్త. జ్ఞాపకశక్తి అనేది జన్యుపరమైనది మాత్రమే కాదు, సరైన పద్ధతులు పాటిస్తే దాన్ని బలోపేతం చేయవచ్చు. ఖరీదైన మందులు, ట్యూషన్లు కాకుండా కొన్ని సాధారణ, శాస్త్రీయంగా నిరూపితమైన అలవాట్ల ద్వారా పిల్లల మెదడుకు పదును పెట్టవచ్చని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు. ఆ సులభమైన పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలలో జ్ఞాపకశక్తి అనేది జన్యువులపై మాత్రమే ఆధారపడి ఉండదు. మెదడును సరైన పద్ధతుల్లో ఉంచితే జ్ఞాపకశక్తిని పెంచవచ్చని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు. దీనికి ఖరీదైన సప్లిమెంట్లు లేదా అంతులేని ట్యూషన్లు అవసరం లేదు. కేవలం కొన్ని సైన్స్ ఆధారిత అలవాట్లు, పద్ధతులు సరిపోతాయి. ఈ 4 పద్ధతులు ఇప్పుడు చూద్దాం.
1. తగినంత నిద్ర తప్పనిసరి
జ్ఞాపకశక్తికి నిద్ర చాలా కీలకం. పగలు నేర్చుకున్న విషయాలు, మెదడులో స్థిరపడటానికి నిద్ర ఉపయోగపడుతుంది. నిద్రలో మెదడులోని నరాల కనెక్షన్లు బలపడతాయి. ఇది స్వల్పకాలిక జ్ఞాపకాలను దీర్ఘకాలిక జ్ఞానంగా మారుస్తుంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు రాత్రి 9-11 గంటలు నిద్రపోయేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.
2. కేవలం చదవడమే కాదు, గుర్తు చేసుకోవడం ముఖ్యం
పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదవడానికి బదులు, చదివిన విషయాలను గుర్తు చేసుకోవడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. పిల్లలు పుస్తకం మూసిపెట్టి, వారికి గుర్తున్న సమాధానాలను చెప్పేలా ప్రోత్సహించండి. లేదా క్విజ్ రూపంలో వారికి ప్రశ్నలు వేయండి. ఇది జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, చదివిన విషయాలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులు, కేవలం మళ్ళీ చదివిన వారి కన్నా 50% ఎక్కువ విషయాలు గుర్తుంచుకున్నారు.
3. ఆటలు, వ్యాయామం మెదడుకు శక్తినిస్తాయి
శారీరక శ్రమ కేవలం కండరాలకే కాదు, మెదడుకు కూడా శక్తినిస్తుంది. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు శారీరక వ్యాయామం, ఆరుబయట ఆటలు ఆడించడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకాంపస్‌కు రక్త ప్రవాహం పెరిగి, పనితీరు మెరుగుపడుతుంది.
4. మెదడుకు సరిపోయే పోషకాహారం
మనం తీసుకునే ఆహారం జ్ఞాపకశక్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అధిక చక్కెరను తగ్గించడం వల్ల ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉండదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (చేపలు, నట్స్, గింజలలో ఉంటాయి) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.




