బీ అలర్ట్.. మీ దిండుకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది? మార్చకపోతే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!
మనం మంచి నిద్ర కోసం మంచం, పరుపు, గది వాతావరణంపై దృష్టి పెడతాము. కానీ, ఒక కీలకమైన అంశాన్ని విస్మరిస్తాము. అదే దిండు. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, పాత దిండు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, శరీర భంగిమ, శ్వాస సమస్యలకు కూడా కారణమవుతుంది. అందువల్ల, మీ దిండును ఎప్పుడు, ఎందుకు మార్చాలో తెలుసుకోవడం ముఖ్యం.

మంచి నిద్ర కోసం మనం పరుపులు, బెడ్‌రూమ్ వాతావరణంపై దృష్టి పెడతాం కానీ, తల కింద పెట్టుకునే దిండు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, దిండ్లకు గడువు తేదీ ఉంటుందా? చాలామంది ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతుంటారు. మీరు సంవత్సరాలుగా ఒకే దిండును వాడుతూ ఉంటే, ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మీరు తెలుసుకోవాలి. మనం నిత్యం వాడే దిండుకు (Pillow) కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని, దానిని సరైన సమయంలో మార్చకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు మార్చాలి?: మనం దిండు కవర్లు మారుస్తున్నా, దిండు లోపలి భాగంలో దుమ్ము, చెమట, బ్యాక్టీరియా నిలిచిపోతాయి. ఇవి అలర్జీలు, మొటిమలు మరియు శ్వాస సంబంధిత ఇబ్బందులకు కారణమవుతాయి. అంతేకాదు.. మనం నిద్రించేటప్పుడు మన తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో ఉండాలి. దిండు పాతబడినప్పుడు అది మెత్తగా అయిపోయి లేదా గడ్డలు కట్టి మెడకు సరైన సపోర్ట్ ఇవ్వదు. దీనివల్ల దీర్ఘకాలిక మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
ఏ దిండును ఎప్పుడు మార్చాలి?: దిండును మార్చాల్సిన సమయం అది దేనితో తయారైందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
సింథటిక్ ఫైబర్ (Polyester): ఇవి త్వరగా ఆకారాన్ని కోల్పోతాయి, కాబట్టి వీటిని 6 నుండి 18 నెలల లోపు మార్చడం మంచిది.
మెమరీ ఫోమ్ (Memory Foam): ఇవి కొంచెం ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. వీటిని 2 నుండి 3 ఏళ్ల వరకు వాడవచ్చు.
లేటెక్స్ (Latex): ఇవి సహజ సిద్ధమైనవి మరియు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. వీటిని 3 నుండి 4 ఏళ్ల వరకు ఉపయోగించవచ్చు.
దిండును మార్చాల్సిన సమయం వచ్చిందని తెలిపే గుర్తులు గమనించాలి. దిండుపై మడతలు పడటం లేదా గడ్డలుగా అనిపించడం. దిండును సగానికి మడిచినప్పుడు అది మళ్ళీ తన పాత స్థితికి త్వరగా రాకపోవడం. నిద్ర లేచిన తర్వాత మెడ లేదా భుజాల నొప్పులు రావడం. దిండుపై శాశ్వతమైన పసుపు మచ్చలు లేదా వాసన రావడం వంటివి కనిపిస్తే వెంటనే మీ దిండును మార్చాలని గుర్తుపెట్టుకోవాలి. మంచి నిద్ర మీ ఆరోగ్యానికి పునాది. కాబట్టి మీ దిండు పరిస్థితిని ఒకసారి గమనించండి. అది పాడైపోయిందని అనిపిస్తే, వెంటనే కొత్తది కొనుగోలు చేయడం మీ ఆరోగ్యానికి మీరు చేసే మంచి పెట్టుబడి.




