
పరిశోధకుల ప్రకారం.. దీని వెనుక ఎలాంటి మాయాజాలం లేదు. కేవలం శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. దోమలు మనల్ని చూడటానికి వాటి కళ్ళను ఉపయోగించవు. బదులుగా శరీరం నుండి వెలువడే నిర్దిష్ట సంకేతాలను ఉపయోగించుకుంటాయి. ఆ విధంగానే అవి మన వద్దకు చేరుకుంటాయి. దోమలు మనుషుల వైపు ఆకర్షించబడటానికి ప్రధాన కారణం మనం ముక్కు ద్వారా వదిలే కార్బన్ డయాక్సైడ్ (CO2) వాయువు. దోమల యాంటెన్నాలపై చాలా సున్నితమైన సెన్సార్లు ఉంటాయి. ఇవి సుమారు 30 నుండి 50 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ వాసనను పసిగట్టగలవు. మనం చీకటిలో శ్వాస తీసుకున్నప్పుడు ఆ వాయువు దోమలకు జీపీఎస్ లాగా పనిచేసి, అవి నేరుగా మన వైపుకే ఎగిరి వస్తాయి. శ్వాస మాత్రమే కాదు మానవ శరీరంలోని సహజ వేడి కూడా దోమలను ఆకర్షిస్తుంది.
దోమలకు సహజమైన ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్లు చీకటిలో వెచ్చని రక్తం గల జంతువులను లేదా మనుషులను గుర్తించడానికి వాటికి సహాయపడతాయి. నిద్రపోతున్నప్పుడు శరీరం నుండి వెలువడే వేడి తరంగాలు దోమలకు మన ఉనికిని తెలియజేస్తాయి. ప్రతి వ్యక్తి శరీర దుర్వాసన భిన్నంగా ఉంటుంది. మన చర్మం నుంచి వెలువడే చెమట, దానిలోని లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా, యూరిక్ ఆమ్లం వంటి అంశాలతో కలిసి దోమలను ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది.
శరీరంలో ఎక్కువ లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యే వ్యక్తులను ఇతరులు కంటే దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది. అందుకే ఒకే గదిలో నిద్రించే ఇద్దరిలో, ఒక వ్యక్తిని దోమలు ఎక్కువగా ఇబ్బంది పెడితే, మరొకరిని తక్కువగా ఇబ్బంది పెడతాయి. దోమ కాటు కేవలం చికాకు కలిగించడమే కాకుండా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తాయి. అందువల్ల దోమల నుంచి రక్షణ పొందడం చాలా అవసరం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.