Video: నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు ఏం వాడేవారో చూడండి..
ప్రకృతి సిద్ధంగా మహిళలకు వచ్చే నెలసరి గురించి మాట్లాడటానికి ఒకప్పుడు చాలామంది సిగ్గుపడేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో పీరియడ్స్ హైజీన్‌పై అవగాహన చాలా పెరిగింది. అయితే 20వ శతాబ్దం చివరి వరకు కూడా ఈ దేశంలో ప్యాడ్స్‌కు బదులుగా బూడిదతో చేసిన సంచులను వాడేవారట. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రుతుక్రమం అనేది మహిళల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇప్పుడు మార్కెట్లో మహిళల కోసం రకరకాల శానిటరీ ప్యాడ్స్, మెన్‌స్ట్రువల్ కప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తూ, బట్టలు పాడవకుండా రక్షణ కల్పిస్తున్నాయి. కానీ అసలు శానిటరీ ప్యాడ్స్ అనేవే లేని ఆ పాత కాలంలో మహిళలు ఏం వాడేవారు? బట్టలపై మరకలు పడకుండా ఎలాంటి పద్ధతులు పాటించేవారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రోజుల్లో మహిళలు శారీరక శ్రమతో కూడిన పనులు చాలా ఎక్కువగా చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో పీరియడ్స్ సమయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారు కొన్ని సాంప్రదాయ, సహజసిద్ధమైన పద్ధతులను అవలంబించేవారు. అప్పట్లో ప్యాడ్స్‌కు బదులుగా మహిళలు ఉపయోగించిన ఒక వింత పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాలో మెన్‌స్ట్రువల్ బెల్ట్స్ వాడేవారు..
వింటే ఆశ్చర్యం కలగవచ్చు కానీ.. చైనాలో 20వ శతాబ్దం చివరి వరకు కూడా మహిళలు పీరియడ్స్ సమయంలో చేతితో తయారు చేసిన మెన్‌స్ట్రువల్ బెల్ట్స్ ఉపయోగించేవారు. ఆ కాలంలో ప్యాడ్స్ గురించి ఎవరికీ అవగాహన లేదు. ఈ బెల్ట్‌లో క్లాత్‌తో చేసిన ఒక చిన్న పౌచ్ ఉండేది. దాన్ని నడుముకు కట్టుకునేవారు. అయితే ఇందులో రక్తస్రావాన్ని పీల్చుకోవడానికి దేన్ని వాడేవారో తెలుసా? కట్టెల బూడిదను.. అవును, ఇంట్లో వంట కోసం వాడే కట్టెల నుండి వచ్చే బూడిదను ఆ గుడ్డ సంచిలో నింపేవారు. ఆ బూడిద రక్తాన్ని పీల్చుకునేలా చేసేవారు. పీరియడ్స్ అయిపోయాక ఆ బూడిదను మొక్కలకు ఎరువుగా వాడేవారు. ఆ గుడ్డ సంచిని మాత్రం నది నీటిలో శుభ్రంగా కడిగి, ఎండబెట్టి మళ్లీ ఉపయోగించేవారు.
ఈ బూడిద పద్ధతి మహిళల ఆరోగ్యానికి సురక్షితమేనా?
చరిత్రలో ఇదొక పద్ధతిగా ఉన్నప్పటికీ.. ఆరోగ్య పరంగా ఇది అస్సలు సురక్షితం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిసెర్చ్ గేట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కట్టెల బూడిదలో ఉండే రసాయనాలు, అశుద్ధాలు యోని సహజ వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల యోని భాగంలో పీహెచ్ స్థాయిలు మారిపోయి.. తీవ్రమైన ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ వాజినోసిస్ వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా రెట్లు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, నేటి ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన శానిటరీ ఉత్పత్తులు మహిళల ఆరోగ్య సంరక్షణలో ఎంతో కీలకమైన మార్పును తీసుకొచ్చాయని చెప్పవచ్చు.
వీడియో చూడండి..
View this post on Instagram
