Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తరచూ దుర్భాషలాడుతున్నాడన్న కక్షతో గొర్రెల కాపరి శ్రీనివాసరావును ముగ్గురు వ్యక్తులు కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉప్పాల వెంకటనారాయణతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ తెలిపారు.

శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఆ భార్యాభర్తల మధ్య ఇంటి ఎదురుగా ఉంటున్న వెంకటనారాయణ చిచ్చుపెట్టాడన్న అనుమానాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా తన ఇంటి ఎదురుగా ఉంటున్న వెంకటనారాయణ వల్లే తన భార్య తనకు దూరమైందని భర్త శ్రీనివాసరావు భావించాడు. వెంకట నారాయణ కనిపించినప్పుడల్లా శ్రీనివాసరావు శాపనార్ధాలు పెడుతుండేవాడు. ఇప్పుడు ఆ శాపనార్ధాలే శ్రీనివాసరావు ప్రాణాలు తీసేలా చేసింది. గ్రామంలో తమను దుర్భాషలాడుతున్నాడన్న కారణంగా కోపం పెంచుకున్న వెంకటనారాయణ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనివాసరావును దారుణంగా కొట్టి చంపాడు. బాపట్ల జిల్లా సంతరావూరులో జరిగిన ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరు పంట పొలాల్లో గొర్రెల కాపరి హత్య కేసును పోలీసులు ఛేధించారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చినగంజాం పోలీస్ స్టేషన్లో చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. సంతరావూరుకు చెందిన గొర్రెల కాపరి అతిన శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. తమ మధ్య గొడవలకు ఇంటి ఎదురుగా ఉన్న ఉప్పాల వెంకటనారాయణ, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కారణమని శ్రీనివాసరావు భావించాడు. వారిని తరచూ తిడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పాత గొడవలను మనసుల పెట్టుకున్న వెంకటనారాయణ అతని స్నేహితులు కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, చేకూరి బలరామ్ తో కలిసి శ్రీనివాస్ ను హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ నెల 23న రాత్రి 11.30 గంటల సమయంలో కేశవరప్పాడు గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న పొలంలో గొర్రెల మంద పక్కన నిద్రిస్తున్న శ్రీనివాసరావును కర్రలతో, కాళ్లతో విచక్షణరహితంగా కొట్టి దారుణంగా చంపేశారు. అనంతరం అక్కడ నుంచి ముగ్గురు పారిపోయారు. మృతుడి తమ్ముడు సురేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుర్భాషలాడుతున్నాడన్న కారణంగానే కొట్టి చంపేశారు..
తన భార్య తనకు దూరంగా ఉండటానికి కారణం తన ఇంటి ఎదురుగా ఉంటున్న వెంకటనారాయణే అని శ్రీనివాసరావు అనుమానం పెంచుకున్నాడు. వెంకట నారాయణతో పాటు అతని స్నేహితులు కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, చేకూరి బలరామ్‌ల వల్లే తన భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్న అక్కసుతో శ్రీనివాసరావు కోపంతో ఉండేవాడు. ఈ నేపధ్యంలో వెంకటనారాయణ, అతని స్నేహితులు ఎక్కడ కనిపించినా దుర్భాషలాడటం శ్రీనివాసరావుకు అలవాటుగా మారింది. శ్రీనివాసరావు వైఖరి వల్ల గ్రామంలో తమ పరువు పోతుందని భావించిన వెంకటనారాయణ అందుకు ప్రతీకారంగా శ్రీనివాసరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 23వ తేదినరాత్రి పొలాల దగ్గర మద్యం తాగుతున్న వెంకటనారాయణ, అతని స్నేహితులకు శ్రీనివాసరావు గొర్రెలను మేపుకునేందుకు వెళుతూ తారసపడ్డాడు.
ఈ సమయంలో కూడా శ్రీనివాసరావు వీరిని దుర్భాషలాడటంతో ఇక లాభం లేదని భావించిన వెంకటనారాయణ బృందం అతడ్ని వెంబడించారు. రాత్రి గొర్రెలను మేతకు వదిలి పొలం దగ్గర నిద్రపోతున్న శ్రీనివాసరావుపై దాడి చేసి కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు పోలీసు జాగిలంతో గాలింపు చేపట్టారు. పోలీసు జాగిలం పొలాల వెంబడి వెతుకుతూ, గ్రామంలోని వెంకటనారాయణ ఇంటి దగ్గరకు చేరుకుంది. దీంతో వెంకటనారాయణ, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య కేసు చిక్కుముడి వీడిపోయింది. సంతరావూరు నుంచి వేటపాలెం వెళ్లే కొమ్మమూరు కాలువ లాకుల వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్‌పి మొయిన్ వివరించారు. నిందితులు హత్యకు ఉపయోగించిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
