అల్లం టీ vs లెమన్ టీ.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఏ టైమ్‌లో ఏది తాగాలో తెలుసుకోండి..
Ginger Tea vs Lemon Tea: మన దేశంలో టీ కేవలం ఒక డ్రింక్ కాదు.. అదొక ఎమోషన్. కొంతమందికి టీ లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది నార్మల్ చాయ్ పక్కనబెట్టి.. అల్లం టీ లేదా లెమన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆరోగ్య పరంగా చూస్తే ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? అనేది తెలుసుకుందాం..

చాయ్ అంటే పడిచచ్చిపోయేవారు మనలో చాలా మంది ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు చాయ్ పడనిదే చాలామందికి రోజే ప్రారంభం కాదు. బెడ్ కాఫీలు, నార్మల్ పాలు పోసిన టీల కంటే ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నవి అల్లం టీ, లెమన్ టీ. చాయ్ ప్రేమికుల్లో ఈ రెండింటికీ విడివిడిగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అల్లానికి ఉండే గుణాలు వేరు, నిమ్మకాయకు ఉండే నైజం వేరు. మరి అసలు మన శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? ఏయే సమయాల్లో ఏ టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అల్లం టీ: రోగాల ముప్పును అడ్డుకునే పవర్‌హౌస్
భారతీయ వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో అల్లాన్ని ఒక గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులోని జింజెరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనం మన శరీరంపై అద్భుతంగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు: చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవగానే కీళ్లు పట్టేయడం లేదా నొప్పులు రావడం జరుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులను, వాపులను సహజ సిద్ధంగా తగ్గిస్తాయి. రోజూ అల్లం టీ తాగడం వల్ల పెయిన్ కిల్లర్స్ వాడే అవసరం తగ్గుతుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పికి దివ్యౌషధం: వాతావరణం మారినప్పుడు లేదా చలికాలంలో గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు బాధిస్తున్నప్పుడు ఒక కప్పు వేడి అల్లం టీ తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపడమే కాకుండా శరీరంలో అవసరమైన వేడిని పుట్టిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కడుపులో గ్యాస్, మంట, అజీర్తి, వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి అల్లం టీ ఒక పర్ఫెక్ట్ మెడిసిన్. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ప్రయాణాల్లో వాంతులు వచ్చే సూచనలు ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది.
లెమన్ టీ
నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. లెమన్ టీ అనేది శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడానికి, ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఇవ్వడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. దీని సువాసన మైండ్‌ను వెంటనే యాక్టివ్ చేస్తుంది.
లెమన్ టీ వల్ల కలిగే టాప్ బెనిఫిట్స్..
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: లెమన్ టీలో ఉండే సిట్రిక్ యాసిడ్ కాలేయాన్ని ఉత్తేజపరిచి, శరీరంలోని పేరుకుపోయిన విషతుల్యాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది.
బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ : ఉదయాన్నే పరగడుపున లేదా వర్కవుట్స్ తర్వాత లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
మానసిక ఒత్తిడి, తలనొప్పి: ఆఫీస్ వర్క్ లేదా పర్సనల్ టెన్షన్ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు లెమన్ టీ తాగితే, నిమ్మకాయలోని సువాసన గుణాలు హ్యాపీ హార్మోన్లను విడుదల చేసి మనసును ప్రశాంతపరుస్తాయి. తలభారాన్ని తగ్గించి, రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
ఏ టీ ఎప్పుడు తాగాలి? మీ శరీరానికి ఏది అవసరం?
ఈ రెండింటిలో ఏది గొప్పదనే దానికంటే.. ఆయా సమయాల్లో మీ శరీరానికి ఏది అవసరమనే దాన్ని బట్టి ఎంచుకోవాలి. మీకు ఒళ్లు నొప్పులు, జలుబు, జీర్ణ సమస్యలు ఉంటే అల్లం టీ ఎంచుకోండి. మీరు ఇన్‌స్టంట్‌గా ఫ్రెష్ అవ్వాలన్నా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా లేదా బరువు తగ్గాలన్నా లెమన్ టీ బెస్ట్ ఛాయిస్.




