వివాహేతర సంబంధాల్లో ఈ చిన్న సిటీ ఇండియాలోనే టాప్.. ఈ లెక్కలు చూస్తే మీ మైండ బ్లాంకే..
ఒకప్పుడు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం అనుకున్న వివాహేతర సంబంధాలు ఇప్పుడు చిన్న పట్టణాల్లోనూ శరవేగంగా విస్తరిస్తున్నాయి. సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా భావించే నగరాలే ఇప్పుడు ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన దేశంలో వివాహ బంధాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాహాన్ని మన వాళ్లు పవిత్ర బంధంగా చూస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనా విధానంలో, బంధాల పట్ల చూసే కోణంలో మార్పులు వస్తున్నాయి. దేశంలో వివాహేతర సంబంధాల ధోరణి వేగంగా పెరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లయిన తర్వాత కూడా బయటి వ్యక్తులతో బంధాలను ఏర్పరచుకోవడానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా పనిచేసే ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం భారత్‌లో విపరీతంగా పెరిగిపోతోంది.
చిన్న నగరాలదే హవా.. కాంచీపురం టాప్..
గ్లోబల్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ యాష్లే మాడిసన్ మే 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం.. ఒకప్పటిలా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలు కాకుండా చిన్న పట్టణాలు ఈ జాబితాలో ముందుండటం గమనార్హం. ఆధ్యాత్మికతకు, కాంచీపట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం నగరం.. వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో అత్యధిక కొత్త అకౌంట్లు నమోదైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. కాంచీపురం తర్వాత కోయంబత్తూరు, తిరువళ్లూరు, చెన్నై నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీన్ని బట్టి దక్షిణ భారత నగరాల్లో ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ల ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరిన భారత్
యాష్లే మాడిసన్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సభ్యత్వాల నమోదు విషయంలో అంతర్జాతీయంగా భారత్ భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల జాబితాలో 8వ స్థానంలో ఉన్న భారతదేశం.. ఈ ఏడాది ఏకంగా 3వ స్థానానికి దూసుకొచ్చింది. దేశ ప్రజల మారుతున్న ప్రవర్తనను, బంధాల పట్ల వారికున్న సరికొత్త ఆలోచనలను ఈ మార్పు స్పష్టం చేస్తోందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
40 లక్షల దాటిన సబ్‌స్క్రైబర్లు
కేవలం యాష్లే మాడిసన్ మాత్రమే కాదు.. వివాహేతర సంబంధాల కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన మరో డేటింగ్ యాప్ గ్లీడెన్ కూడా భారత్‌లో తమకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ప్రకటించింది. భారతదేశంలో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పటికే 40 లక్షల మైలురాయిని దాటినట్లు గ్లీడెన్ తెలిపింది. ఈ గణాంకాలు చూస్తుంటే ఇలాంటి ప్లాట్‌రమ్‌ల పట్ల భారతీయుల్లో ఆసక్తి ఎంతలా పెరిగిందో స్పష్టమవుతోంది.
సర్వేలో షాకింగ్ నిజాలు
గతంలో గ్లీడెన్ సంస్థ దేశంలోని టైర్-1, టైర్-2 నగరాలకు చెందిన 25 నుండి 50 సంవత్సరాల వయస్సు గల 1,503 మంది వివాహితుల మధ్య ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తాము వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నామని, తాము ఓపెన్ మైండెడ్‌గా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇందులో భార్యాభర్తల పరస్పర అంగీకారంతో ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, భాగస్వాములను మార్చుకోవడం వంటి వెస్ట్రన్ కల్చర్ ఆప్షన్లకు కూడా తాము సిద్ధమేనని కొందరు అభిప్రాయపడటం గమనార్హం.
నిపుణులు ఏమంటున్నారు?
యాష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ మాట్లాడుతూ.. భారత్ 8వ స్థానం నుండి 3వ స్థానానికి చేరడం అనేది, భారతీయులు ఇప్పుడు బంధాలు, వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛను మునుపటి కంటే భిన్నమైన కోణంలో చూస్తున్నారనడానికి సంకేతమని అన్నారు. మరోవైపు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ఇంటర్నెట్ విప్లవం, మారుతున్న జీవనశైలి, ఒంటరితనం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఈ మార్పులు వస్తున్నాయని, ఇది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు సైతం వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




