పిల్లల మనసులు గెలవాలా? GenZ పేరెంట్స్ ఫాలో అవుతున్న కొత్త పద్ధతులు ఇవే
ప్రతి తరంలోనూ పిల్లల పెంపక శైలి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే కేవలం అధికారం చలాయించేవారు, కఠినమైన క్రమశిక్షణను పాటించేవారనే ముద్ర ఉండేది. ముఖ్యంగా మిలీనియల్స్ పెంపకంలో క్రమశిక్షణకు పెద్దపీట వేసేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో 'జెన్ జీ' (Gen Z) తల్లిదండ్రులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. వీరు పిల్లలపై అధికారం కంటే వారిపై నమ్మకాన్ని పెంచుకోవడానికి, వారి భావాలను గౌరవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జెన్ జీ పేరెంటింగ్ స్టైల్ గురించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి మోనా సింగ్ తన తాజా ప్రాజెక్ట్ ‘మా కా సమ్’ ప్రమోషన్ల సందర్భంగా పిల్లల పెంపకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పిల్లలతో నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు. పాతకాలపు పద్ధతులకు స్వస్తి పలికి నేటి తరం తల్లిదండ్రులు అనుసరిస్తున్న ఈ స్నేహపూర్వక పెంపకం గురించి తెలుసుకుందాం..
నిజాయితీతో కూడిన అనుబంధం
మోనా సింగ్ తన సోదరి పిల్లలను పెంచే తీరును చూసి తాను ఎంతో స్పూర్తి పొందానని తెలిపారు. “నేను నా సోదరిని తన పిల్లలతో గమనిస్తుంటాను, ఆమె వారితో ఎంతో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉంటుంది. ఆ పద్ధతి నాకు చాలా నచ్చింది” అని ఆమె పేర్కొన్నారు. జెన్ జీ పేరెంటింగ్ అంటే పిల్లలకు అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడం కాదని, వారికి విషయాలను స్పష్టంగా వివరించడం అని ఆమె అభిప్రాయపడ్డారు. దీనివల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య నమ్మకం బలపడటమే కాకుండా పిల్లలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోగలుగుతారు.
భావాలకు విలువ ఇవ్వడం
పాతకాలంలో పిల్లలు ఏడిస్తే “ఎందుకు ఏడుస్తున్నావ్, ఏడవకూడదు” అని అడిచేవారు. కానీ జెన్ జీ తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను గుర్తిస్తున్నారు. పిల్లలు ఎందుకు బాధపడుతున్నారు లేదా ఎందుకు కోపంగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకుని, వారి భావాలను ‘వ్యాలిడేట్’ చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత పెరుగుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న వివిధ రకాల పేరెంటింగ్ చిట్కాలు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాయి.
అధికారం చూపిస్తూ పిల్లలను భయపెట్టడం కంటే, వారితో ఒక స్నేహితుడిలా మెలిగి వారి మనసును అర్థం చేసుకోవడమే నేటి కాలానికి అవసరమైన పెంపకం. మోనా సింగ్ చెప్పినట్లుగా పిల్లలతో నిజాయితీగా ఉంటే, వారు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మన పెంపక శైలిని మార్చుకోవడం వల్ల దృఢమైన కుటుంబ బంధాలను నిర్మించుకోవచ్చు.
