AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Steam Dosa Recipe: టొమాటో స్టీమ్ దోసె.. పిండి పులియబెట్టకుండానే 10 నిమిషాల్లో రెడీ!

ఉదయం లేవగానే పిల్లలకు స్కూల్ టిఫిన్, పెద్దలకు ఆఫీస్ లంచ్ బాక్స్ సిద్ధం చేయాలంటే ఏం వండాలో చాలామందికి అర్థం కాదు. ముఖ్యంగా ఇంట్లో ఇడ్లీ లేదా దోసె పిండి సిద్ధంగా లేకపోతే టిఫిన్ తయారీ మరింత కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా, పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా తయారు చేసుకునే టొమాటో స్టీమ్ దోసె మంచి ఆప్షన్‌గా ఉంటుంది. కేవలం కొన్ని పదార్థాలతో పిండిని సిద్ధం చేసి, పెనంపై మూత పెట్టి ఆవిరితో ఉడికిస్తే సరిపోతుంది.

Tomato Steam Dosa Recipe: టొమాటో స్టీమ్ దోసె.. పిండి పులియబెట్టకుండానే 10 నిమిషాల్లో రెడీ!
Tomato Steam Dosa
Bhavani
|

Updated on: Aug 31, 2026 | 10:17 PM

Share

టొమాటో, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, సుగంధ దినుసులతో తయారయ్యే ఈ దోసె సాధారణ దోసెలకు భిన్నంగా మందంగా, మెత్తగా, స్పాంజిలా ఉంటుంది. టొమాటో వల్ల స్వల్ప పులుపు, రుచి వస్తుంది. కొబ్బరి చట్నీ లేదా మసాలా గ్రేవీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ ఇన్‌స్టంట్ టొమాటో స్టీమ్ దోసెను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

1. కావలసిన పదార్థాలు

టమోటాలు – 3 మధ్యస్థ పరిమాణంలో

బొంబాయి రవ్వ – ½ కప్పు

బియ్యప్పిండి – ½ కప్పు

గోధుమ పిండి – ¼ కప్పు

అల్లం – 1 అంగుళం

ఎండు మిరపకాయలు – 2–3

జీలకర్ర – 1 టీస్పూన్

ఉల్లిపాయ – 1

కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – తగినంత

నీరు – 2½–3 కప్పులు

నూనె లేదా నెయ్యి – కొద్దిగా

2. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి

ముందుగా టమాటాలు, అల్లం, ఎండు మిరపకాయలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరు కలపాలి. మరో గిన్నెలో బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, గోధుమపిండి వేసి కలపాలి. ఇందులో టొమాటో పేస్ట్, జీలకర్ర, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

3. పిండిని ఎలా సిద్ధం చేయాలి?

ఇప్పుడు మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ కలుపుకోవాలి. పిండి రవ్వ దోసె పిండిలా కొద్దిగా పలుచగా ఉండాలి. అయితే పాలలా మరీ పలుచగా ఉండకూడదు. పిండి సిద్ధమైన తర్వాత సుమారు 10 నిమిషాలు నాననివ్వాలి. దీనికి ప్రత్యేకంగా పులియబెట్టే అవసరం లేదు.

4. స్టీమ్ దోసె ఎలా వేయాలి?

పెనాన్ని మధ్యస్థ మంటపై వేడి చేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద చెంచా పిండిని పెనంపై పోయాలి. సాధారణ దోసెలా పలుచగా పరచకూడదు. కొద్దిగా మందంగా ఉండేలా వదిలేయాలి. అనంతరం మూత పెట్టి సుమారు 3–4 నిమిషాలు ఉడికించాలి.

ఆవిరితో దోసె పైభాగం మెత్తగా, స్పాంజిలా మారుతుంది. కింద భాగం బంగారు రంగులోకి వచ్చిన తర్వాత అవసరమైతే దోసెను తిప్పి మరో 30 సెకన్ల పాటు ఉడికించాలి. అంతే.. వేడి వేడి టొమాటో స్టీమ్ దోసె సిద్ధం.

5. దేనితో తింటే బాగుంటుంది?

టొమాటో స్టీమ్ దోసెను కొబ్బరి చట్నీ, మసాలా గ్రేవీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు పిల్లలకు లేదా ఆఫీసుకు వెళ్లేవారికి త్వరగా టిఫిన్ సిద్ధం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

Follow Us