ఆరోగ్యమే మహాభాగ్యం.. చికెన్ తిన్న తర్వాత ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు..
చికెన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారమైనప్పటికీ, దానిని తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, అధిక చక్కెర కలిగిన స్వీట్లు, సిట్రస్ పండ్లు, నూనెలో వేయించిన స్నాక్స్‌ను చికెన్ తిన్న వెంటనే తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మాంసాహార ప్రియులకు చికెన్ ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన వంటకం.. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇష్టంగా కొని తెచ్చుకుంటారు. కొందరు నాటు కోడి, మరికొందరు బ్రాయిలర్ కొనుగోలు చేస్తారు. కూరగా, ఫ్రై – గ్రిల్ గా, బిర్యానీ రూపంలో లేదా ఇతరత్రా ఏ రూపంలోనైనా చికెన్ వంటకం ఉంటే భోజనం మరింత రుచిగా మారుతుంది. ఆధునిక జీవనశైలిలో చాలామంది వారానికి ఒకటి రెండు సార్లు కాకుండా తరచూ చికెన్ ను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే చికెన్ శరీరానికి శక్తినిచ్చే మంచి ఆహారమే అయినప్పటికీ, దానిని తిన్న తర్వాత కొన్ని ఆహారాలను వెంటనే తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జీర్ణక్రియ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
పాల ఉత్పత్తులు వద్దు:
చికెన్ తో పాటు లేదా చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉండగా, పాలలో కాల్షియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు భిన్నమైన పోషక గుణాలు కలిసినప్పుడు జీర్ణ వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని 2022లో ప్రచురితమైన ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక పేర్కొంది. ఈ కలయిక వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు ఈ అలవాటును పూర్తిగా మానుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు వద్దు:
చికెన్ తో భోజనం అనంతరం స్వీట్లు, కేకులు, ఐస్ క్రీములు లేదా అధిక చక్కెర కలిగిన పానీయాలను తీసుకోవడం శరీరానికి మేలు చేయదు. అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచి, తర్వాత త్వరగా పడిపోవడానికి కారణమవుతుంది. దీనివల్ల అలసట, నీరసం కలగవచ్చు. అంతేకాకుండా, ఇవి జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి.
సిట్రస్ పండ్లు వద్దు:
నిమ్మకాయ, నారింజ, మోసంబి వంటి సిట్రిక్ యాసిడ్ అంటే ఆమ్ల గుణాలు కలిగిన పండ్లను చికెన్ తో కలిపి లేదా వెంటనే తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది. ఇది ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీయొచ్చు. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే ఈ రకమైన కలయికలను నివారించడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నూనెలో వేయించిన స్నాక్స్ వద్దు:
చికెన్ ఇప్పటికే కొంతవరకు కొవ్వు పదార్థం కలిగిన ఆహారం. దాని తర్వాత బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటి నూనెలో వేయించిన స్నాక్స్ తినడం జీర్ణ వ్యవస్థపై మరింత భారం వేస్తుంది. ఈ రకమైన ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా పొట్ట నిండిన భావన, గ్యాస్, మంట, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తరచూ ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో జీర్ణకోశ సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కేవలం పోషకాహారం తీసుకోవడం మాత్రమే కాకుండా, ఆహార కలయికలపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. చికెన్ వంటి ప్రోటీన్ సమృద్ధి ఆహారం తీసుకున్న తర్వాత తగిన విరామం ఇచ్చి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సరైన ఆహార నియమాలు పాటిస్తే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం చురుకుగా ఉండడానికి సహాయపడుతుందని.. ఈ ఆరోగ్య చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
