Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Curry: కోనసీమ స్టైల్‌లో ఈ సీజన్‌లో పండుగప్ప చేపల పులుసు మామిడి కాయతో చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ

మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ప్రియులు వేరు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఆరోగ్యకరమైనవి చేపలు. ఈ చేపలలో ఎన్నో రకాలున్నాయి. అదే విధంగా ఈ చేపలను కూర, పులుసు, వేపుడు, బిర్యానీ, పికిల్ ఇలా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. అయితే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా చేపలతో కూరలను తయారు చేస్తారు. ముఖ్యంగా చేపలు అంటే చాలు పులుసు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈ రోజు చింత పండు అవసరం లేకుండా టేస్టీ టేస్టీ చేపల పులుసుని తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

Fish Curry: కోనసీమ స్టైల్‌లో ఈ సీజన్‌లో పండుగప్ప చేపల పులుసు మామిడి కాయతో చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
Fish Pulusu
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2025 | 6:55 PM

చేపలు పులుసు.. తలచుకుంటే చాలు నోరూరుతుంది. మసాలా గుమగుమలతో పుల్లపుల్లగా ఉండే చేపల పులుసుని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నెల్లూరు చేపల పులుసు, కోనసీమ స్టైల్ లో చేపల పులుసు ఇలా ప్రాంతాల పేరుతో ఫేమస్ అయ్యాయి కూడా. అయితే ఎ ప్రాంతం వారు అయినా సరే చేపల పులుసు పెట్టడానికి ఖచ్చితంగా చింత పండుని ఉపయోగిస్తారు. అయితే కోనసీమ వాసులు మాత్రం ఈ సీజన్ లో అంటే మామిడి కాయ దొరికే సీజన్ లో చేపల పులుసుని చింత పండు లేకుండా తయారు చేసుకుంటారు. చింత పండుకి బదులుగా మామిడి కాయతో చేపల పులుసుని పెట్టుకోండి. ఈ చేపల పులుసు టేస్ట్ మరో లెవెల్ అని అంటారు. ఈ రోజు మామిడి కాయతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

పండుగప్ప చేప ముక్కలు – 1 కేజీ

ఉల్లిపాయలు – 3

ఇవి కూడా చదవండి

అల్లం వెల్లుల్లి పేస్ట్​ – 2 టేబుల్​ స్పూన్లు

పచ్చిమిర్చి – 4

కరివేపాకు – 2 రెమ్మలు

కొబ్బరి పాలు – ఒక కప్పు

ధనియాల పొడి – 1 టీ స్పూన్​

జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్​

ఉప్పు – రుచికి సరిపడా

పసుపు – కొంచెం

కారం – రుచికి సరిపడా

నిమ్మరసం – అర చెక్క

పుల్లని మామిడి కాయ – 1

కొత్తిమీర – కొంచెం

తయారీ విధానం: ముందుగా చేపల ముక్కలను ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి చేప ముక్కలను తీసుకుని కొంచెం పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి మారినేట్​ చేసుకుని చేప ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి కాయను తీసుకుని కడిగి దాని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని మామిడి కాయ ముక్కలను టెంకతో సహా వేసి రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చే వరకూ మామిడి ముక్కలను ఉడికించాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి.. ఉడికిన మామిడి కాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకుని మిక్సిలో వేసుకుని మొత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఇప్పుడు దళసరి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఐదు స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడి ఎక్కినా తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని తర్వాత ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసి వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తర్వాత ఉప్పు, పసుపు, తగినంత కారం వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేగి నూనె పైకి తేలిన తర్వాత ఒక కప్పు నీరు పోసుకుని మరిగించండి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో మారినేట్​ చేసి పక్కకు పెట్టుకున్న చేప ముక్కలను ఒకొక్కటిగా జాగ్రత్తగా అమర్చండి. తక్కువ మంట మీద చేప ముక్కలను ఉడికించాలి. నూనె కొంచెం పైకి తేలిన తర్వాత రెడీ చేసుకున్న మామిడి కాయ గుజ్జుని, కొబ్బరి పాలను పోసుకోవాలి. సిమ్ మీద పావు గంట ఉడికించాలి. చేప ముక్కలు ఉడికిన తర్వాత నూనె పులుసు మీద తేలిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటే చాలు చింత పండు లేని చేపల పులుసు రెడీ.

గమనిక: ఈ చేపల పులుసు మట్టి దాకలో పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అంతేకాదు చేపలను ఎక్కువ సమయం ఉడికితే అవి విడిపోయాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..