AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రోటీన్ తక్కువైతే శరీరానికి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

ప్రోటీన్ మన శరీరానికి అత్యవసరమైన పోషక పదార్థం. ఇది కండరాల పెరుగుదల, శక్తి ఉత్పత్తి, రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రోటీన్ తక్కువగా ఉంటే అలసట, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రోటీన్ తక్కువైతే శరీరానికి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
Protein Foods
Follow us
Prashanthi V

|

Updated on: Apr 02, 2025 | 11:30 AM

ప్రోటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషక పదార్థాలలో ఒకటి. ఇది కండరాల నిర్మాణానికి, శక్తిని అందించడానికి, ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రోటీన్ లోపం వల్ల కలిగే ప్రధాన సమస్యల గురించి తెలుసుకుందాం.

ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరానికి తగిన శక్తి అందదు. దీని కారణంగా రోజంతా నీరసంగా అనిపించవచ్చు. చిన్న చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ప్రోటీన్ లోపం వల్ల తక్కువ శక్తి అందుతుందని గుర్తించవచ్చు.

ప్రోటీన్ శరీర కణాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది తక్కువగా ఉంటే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అలాగే చర్మం మృదువుగా కాక పొడిబారినట్లు అనిపించవచ్చు. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొలాజన్ స్థాయి తగ్గిపోవడం వల్ల చర్మం మెరుపును కోల్పోయి ఆరోగ్యంగా కనిపించదు.

ప్రోటీన్ లోపం వల్ల గోళ్ల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. గోళ్లు సులభంగా విరిగిపోతాయి. కొందరికి గోళ్లపై చిన్న చిట్లింపులు, నరుగు, లేదా అసమాన పెరుగుదల కనిపించొచ్చు.

కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైన పోషక పదార్థం. ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు కండరాలు బలహీనమై నొప్పులు పెరుగుతాయి. శరీర దృఢత తగ్గిపోవడం వల్ల మామూలుగా ఉండే పనులు కూడా కష్టంగా అనిపించవచ్చు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కండరాల నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

శరీరంలో గాయాలు త్వరగా మానడానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ తక్కువగా ఉంటే కణాలు త్వరగా పునరుద్ధరించబడవు. చిన్న గాయాలు కూడా త్వరగా మానకుండా ఎక్కువ రోజులు పట్టొచ్చు.

ప్రోటీన్ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది తక్కువగా ఉంటే శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి వ్యాధికారక సూక్ష్మజీవులను ఎదుర్కోలేకపోతుంది. దీని వల్ల తరచుగా జలుబు, జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్ లోపం వల్ల మానసికంగా కూడా ఒత్తిడి, ఆందోళన, అధిక ఆలోచన లాంటి సమస్యలు రావచ్చు. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోతే మెదడు సరైన విధంగా పనిచేయలేదు.

ఈ లక్షణాలు గమనించినప్పుడు సొంత వైద్యం కాకుండా వైద్యుడిని వెంటనే సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని నివారించుకోవచ్చు. చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు, కాయధాన్యాలు వంటి ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవడం చాలా అవసరం.

ప్రోటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది శరీర ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం మంచిది.