టిఫిన్ గా, స్నాక్ గా, డిన్నర్ గా ఏ టైమ్ లో నైనా తినే ఐటెమ్ వడలు. వీటినే గారెలు అని కూడా అంటారు. అలా వేడి వేడి గారెల్లో కోడి కూర వేసుకుని తింటే ఆహా అనాల్సిందే. ఆ కాంబినేషనే వేరు. కోడి కూరలో గారె ముంచుకుని తింటే.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా వీటినే స్నాక్స్ గా వేస్తారు. అయితే ఇప్పుడున్న హడావిడిలో అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలంటే కాస్త ప్రాసెస్ ఉంటుంది. మినప పప్పు నాన బెట్టుకుని.. రుబ్బి వేసుకోవాలంటే సమయం ఎక్కువ పడుతుంది. ఇలా కాకుండా అప్పటికప్పుడు వేసుకోవాలంటే.. వడ పిండిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవచ్చు. దీన్ని అప్పటికప్పుడు మిక్స్ చేసుకుని గారెలు వేసుకోవచ్చు. మరి ఆ వడ పిండిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
వడ పొడికి కావాల్సిన పదార్థాలు:
మినపప్పు, వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తి మీర, జీలకర్ర, నూనె.
వడ పొడి తయారీ విధానం:
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిని ఒక కళాయిలో బాగా వేయించుకోవాలి. ఈ పప్పు చల్లారాక.. మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండికి గాలి తగలకుండా.. ఓ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. దాదాపుగా ఈ పిండి మూడు నుంచి 4 నెలల వరకూ నిల్వ ఉంటుంది. ఈ పిండితో తయారు చేసుకున్న వడలు కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.
ఇప్పుడు ఈ పొడితో ఎలా వడలు తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు కావాల్సినంత క్వాంటిటీ పిండి తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని, కలుపుకుని ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తి మీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. నెక్ట్స్ వడల మాదిరి ఒత్తుకుని వేడి నూనెలో వేసుకుని.. రెండు వైపులా బాగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వడలను అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. గెస్టులు వచ్చినా నో ప్రాబ్లమ్. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. వీటిని చట్నీ, సాంబార్, కోడి కూరతో ఎలా తిన్నా సూపర్ గా ఉంటాయి. ఓ సారి మీరు కూడా ఇలా చేసి చూడండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.