చలి కాలంలో ఆహారాన్ని వేడి వేడిగా తీసుకోవాలి. చలికి సాధారణమైన పదార్థాలు తినబుద్ది కాదు. కారంగా పుల్లగా ఉండే వాటిని తినాలి అనిపిస్తుంది. అందుకే ఎండా కాలంలో పెట్టిన ఆవకాయ పచ్చడిని.. చలి కాలంలో తింటారు. అలాగే ఉసిరి కాయల పచ్చడి కూడా పెడుతూ ఉంటారు. ఈ సీజన్ లో ఉసిరి కాయలు అనేవి విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఉసిరి కాయతో కూడా చాలా రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఉసిరి కాయ తొక్కు పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే.. ఆహా అనాల్సిందే. చెబుతుంటేనే నోరు ఊరి పోతుంది కదా.. నిజంగానే అలా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకం పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా చేసుకుని తినండి. ఇది చేయడం కూడా ఈజీనే. మరి ఈ ఉసిరి కాయ తొక్కు పచ్చడిని ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి కాయ తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
ఉసిరి కాయలు, నూనె, ఉప్పు, పసుపు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మ రసం, ఎండు మిర్చి, కరి వేపాకు.
ఉసిరి కాయ తొక్కు పచ్చడి:
ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి పక్కకి పెట్టు కోవాలి. తర్వాత ఉసిరి కాయలను లోపల కట్ చేసి గింజలను తీసేయాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసు కోవాలి. తర్వాత ఉసిరి కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. ఇవి బాగా మగ్గాక.. ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వేసి వేడి చేయాలి. మెంతులు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేసి దోరగా వేయించాలి. తర్వాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉసిరి కాయ ముక్కలు, నిమ్మ రసం వేసి మెత్తగా మిక్సీ పట్టు కోవాలి.
ఆ నెక్ట్స్ చిన్న కడాయి తీసుకోవాలి. తాళింపుకు సరిపడగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక తాళింపు సరుకులు వేసి వేయించు కోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరి కాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో కూడా పెట్టు కోవచ్చు. ఒకటి రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది.