కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఉడకబెట్టిన ఓ కోడి గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు చాలా లభిస్తాయి. కోడి గుడ్లతో ఎన్నో రకాల రెసిపీ తయారు చేసుకుని తినే ఉంటారు. కోడి గుడ్లతో స్నాక్స్ చాలా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటాయి. కోడి గుడ్లతో తయారు చేసే టేస్టీ రెసిపీల్లో ఎగ్ కీమా మసాలా కర్రీ కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా చపాతీ, రోటీలతో తింటూ ఉంటారు. చాలా త్వరగా, ఈజీగా అయిపోతుంది. మరి ఇంత రుచిగా ఉండే ఎగ్ కీమా మసాలా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడకబెట్టిన గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్, పచ్చి మిర్చి, టమాటా, గరం మసాలా, పెరుగు, జీలకర్ర, కారం, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర
ముందుగా గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగాక.. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
ఆ తర్వాత పెరుగు కూడా వేసి చిన్న మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా వేసి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసి కలుపు కోవాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ కీమా మసాలా సిద్ధం.