కాకర కాయ కూర అనగానే ముఖం అంతా వికారంగా పెడతారు. కానీ కాకరతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా కాకర కాయ తింటే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టేసేయవచ్చు. కానీ చాలా మంది తినడానికి ముందుకు వచ్చినా చేదు వల్ల దూరం పెడతారు. కానీ చేదు లేకుండా చేసే ఈ కాకర వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పాత పద్దతిలో చేసే ఈ కాకర కాయ వేపుడు చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కాకర కాయ వేపుడు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కాకర కాయలు, వేరు శనగ, వేయించిన చనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, మజ్జిగ, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆయిల్, ఉల్లి పాయలు.
ముందుగా వేరు శనగ గుళ్లు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కల్ని, వేయించిన చనగపప్పు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చాల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కాకర కాయలపై ఉండే చెక్కును లైట్‌గా తీసేసి రౌండ్‌గా ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి మజ్జిగ, నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కాకర కాయ ముక్కలను అందులో వేసి ముక్కలు ఇంకిపోయేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి.
ఆయిల్ కాగాక.. ఉడికించుకున్న కాకర ముక్కల్ని ఆయిల్ లో వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. నెక్ట్ ఉల్లిపాలయలను సన్నగా కట్ చేసుకుని వీటిని ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చాక కాకరకాయల మీద వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పాత కాలం కాకర కాయ వేపుడు సిద్ధం. ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేదు అనేదే ఉండదు.