అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
మార్కెట్ నుండి అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే అవి నల్లగా మారిపోతున్నాయా? సగం పండ్లు తినకముందే పారేయాల్సిన పరిస్థితి వస్తోందా? అయితే మీరు అరటిపండ్లను నిల్వ చేసే పద్ధతిలో ఏదో పొరపాటు జరుగుతోందని అర్థం. అరటిపండ్లు వారం రోజుల పాటు తాజాగా, గట్టిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రముఖ మాస్టర్‌చెఫ్ పంకజ్ భదౌరియా చెప్పిన చిట్కాల గురించి తెలుసుకుందాం..

చాలామంది ఇళ్లలో ఎదురయ్యే సాధారణ సమస్య.. అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే బాగా పండిపోయి, నల్లగా మారిపోవడం. చివరకు వాటిని తినలేక పారేయాల్సి వస్తుంది. దీనివల్ల డబ్బు వృధా అవ్వడమే కాకుండా పోషకమైన పండును మిస్ అవుతాం. అయితే ప్రసిద్ధ మాస్టర్‌చెఫ్ పంకజ్ భదౌరియా అరటిపండ్లను వారం రోజుల వరకు తాజాగా ఉంచేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలను పంచుకున్నారు. చాలామంది మార్కెట్ నుండి తెచ్చిన అరటిపండ్లను ప్లాస్టిక్ కవర్‌లోనే వదిలేస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. మూసి ఉన్న సంచిలో అరటిపండ్ల నుండి విడుదలయ్యే ఇథిలీన్ వాయువు పీడనం పెరిగి, పండ్లు గంటల వ్యవధిలోనే కుళ్ళిపోవడం మొదలవుతాయి. కాబట్టి ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని కవర్ నుండి తీసి గాలి తగిలే చోట ఉంచాలి.
కాండం దగ్గర సీల్ చేయండి
అరటిపండు పండే ప్రక్రియ దాని కాండం నుండి మొదలవుతుంది. అక్కడి నుండే ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది. చెఫ్ పంకజ్ సూచన ప్రకారం.. అరటి గెల పైభాగాన్ని అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ ర్యాప్‌తో గట్టిగా చుట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ వాయువు బయటకు రాకుండా అడ్డుకుని, పండు పండే ప్రక్రియను 4-5 రోజుల వరకు ఆలస్యం చేయవచ్చు.
వేలాడదీయడం
అరటిపండ్లను బుట్టలో లేదా నేలపై ఉంచితే, అడుగున ఉన్న పండ్లపై ఒత్తిడి పడి అవి త్వరగా నల్లబడతాయి. వీటికి గాలి సమానంగా తగలాలంటే ఒక కొక్కెనికి లేదా బనానా హ్యాంగర్‌కు వేలాడదీయాలి. దీనివల్ల పండ్లపై ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఫలితంగా అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
గెల నుండి విడదీయడం మంచిదా?
మీరు అరటిపండ్లను ఇంకా ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, వాటన్నింటినీ గెలగా ఉంచకుండా ఒక్కొక్కటిగా విడదీయండి. ప్రతి అరటిపండు కాండాన్ని విడివిడిగా ప్లాస్టిక్ ర్యాప్‌తో చుట్టాలి. ఒక పండు నుండి వచ్చే వాయువు మరొకదానిపై ప్రభావం చూపకుండా ఉండటానికి ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది.
ఇతర పండ్లకు దూరంగా..
ఆపిల్, టమోటాలు వంటి పండ్లు కూడా ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. వీటిని అరటిపండ్లతో కలిపి ఒకే బుట్టలో ఉంచితే, అరటిపండ్లు ఊహించిన దానికంటే వేగంగా పాడైపోతాయి. అందుకే అరటిపండ్లను ఎప్పుడూ విడిగా ఉంచడం మంచిది.
ఫ్రిజ్‌లో పెట్టవచ్చా..?
చాలామందికి ఉండే సందేహం ఇది. అరటిపండ్లు పక్వానికి రాకముందే ఫ్రిజ్‌లో పెడితే వాటి తొక్క నల్లగా మారుతుంది. అయితే లోపల పండు మాత్రం తాజాగా ఉంటుంది. కానీ గది ఉష్ణోగ్రత వద్ద పైన చెప్పిన చిట్కాలు పాటించడం అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి.
బాగా పండిపోతే పారేయకండి
ఒకవేళ అరటిపండ్లు బాగా పండిపోయినా వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్మూతీలు, బనానా షేక్స్, పాన్‌కేక్స్ లేదా పిల్లల కోసం బనానా బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో అరటిపండ్లు వారం వరకు తాజాగా ఉంటాయి. డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఆరోగ్యకరమైన పండ్లను వృధా చేయకుండా నివారించవచ్చు.
