వెజిటీరియన్స్‌కి ఉన్న ఆప్షన్స్‌లో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్‌తో ఎన్నో రకాల కర్రీస్, స్నాక్స్ ఇలా ఒక్కటేంటి.. ఎన్నో వెరైటీలు తయారు చేసుకుంటారు. పన్నీర్‌కి ఫ్యాన్స్ ఎక్కువే. పన్నీర్‌తో చేసే కర్రీల్లో ఎక్కువగా పాలక్ పన్నీర్ గురించి వినే ఉంటారు. కానీ పన్నీర్ గోంగూర కాంబినేషన్ గురించి విని ఉండరు కదూ.. రుచి అయితే అదిరిపోతుంది. పుల్ల పుల్లగా.. కాస్త కారంగా, పన్నీర్ సాఫ్‌గా ఉంటుంది. ఈ కర్రీని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సులభం. పన్నీర్, గోంగూర ఇవి రెండూ కూడా పోషకాలు నిండి ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి పన్నీర్ గోంగూర కర్రీ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీర్, గోంగూర, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొత్తి మీర, ఆయిల్, నెయ్యి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర.
ముందుగా స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టి.. పన్నీర్‌ని ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాత్ర తీసుకుని నీళ్లు వేసి.. గోంగూరని వేసి ఉడక బెట్టి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, జీడి పప్పు వేసి ఒక సారి వేయించు కోవాలి. ఇవి రంగులోకి మారాక.. పక్కన పెట్టి చల్లార్చు కోవాలి. చల్లార్చాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలోకి తీసుకుని గోంగూర కూడా వేసి మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాక.. ఆ మిశ్రమంలో పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం వేసి ఒకసారి వేయించాలి. ఇది బాగా వేగాక గోంగూర పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక.. కారం, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించు కోవాలి. ఇవన్నీ వేగాక.. ముందుగా ఉడికించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడక నివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి.. కొత్తి మీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గోంగూర కర్రీ రెడీ.