
పండగా లేదా ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియుల ఇళ్లలో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్ ముక్కలతో పాటు మేక తలకాయ మాంసం, కాళ్లు, రక్తం, బోటీని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిలో బోటీ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి దాని పేగులలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
రక్తహీనతకు చెక్: మేక పేగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.
చర్మం – జుట్టు ఆరోగ్యం: బోటీలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ A, విటమిన్ E చర్మ కణాలను రక్షిస్తాయి.
రోగ నిరోధక శక్తి: దీనిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాల నుండి శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రొటీన్లు – విటమిన్లు: శారీరక బలానికి కావాల్సిన ప్రొటీన్లు, బి-విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
బోటీ తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దానిని శుభ్రం చేసే పద్ధతి చాలా ముఖ్యం. పేగులలో మలినాలు ఉండే అవకాశం ఉన్నందున వేడి నీటితో కనీసం నాలుగైదు సార్లు క్షుణ్ణంగా కడిగి బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. సరిగ్గా ఉడకని బోటీ వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతుందని లేదా రుచిగా ఉందని అతిగా తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మటన్ లేదా బోటీ ఏదైనా సరే.. పరిమితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..