ఆంధ్ర స్టైల్ గోరుచిక్కుడు కూర చేయాలంటే ఈ రుచికరమైన రెసిపీ ఫాలో అవ్వండి..!
గోరుచిక్కుడు కూరను సులభంగా మసాలాలతో రుచిగా తయారు చేసుకోవచ్చు. గోరుచిక్కుడుతో సాధారణంగా కూర లేదా వేపుడు చేస్తుంటారు. దీనిని గవర, గ్వార్, గువార్, మట్టికాయ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రాంతాలను బట్టి గోరుచిక్కుడు, చావలికాయ, గ్వారా అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఇది ఇతర బీన్స్ కంటే కాస్త గట్టిగా ఉండే కూరగాయ. అందుకే ముందు ఉడికించి తర్వాత మసాలాలో వేసి వండితే మెత్తగా రుచిగా ఉంటుంది. ఇవాళ మనం ఆంధ్ర స్టైల్ లో గోరుచిక్కుడు కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా వేరుగా వండే కొన్ని రకాల గురించి కూడా తెలుసుకుందాం.
గోరుచిక్కుడు కూర కొంచెం మసాలా ఎక్కువగా ఉండేలా చేస్తారు. ఇందులో అల్లం వెల్లులి పేస్ట్, గరం మసాలా ఉంటాయి. సాధారణంగా రోజువారీ కూరల్లో ఇవి తక్కువగా వాడతారు. కానీ గోరుచిక్కుడు కొంచెం చేదుగా ఉండటంతో ఈ మసాలాలు వేసినప్పుడు ఆ చేదు తగ్గిపోతుంది. ఈ కూర మసాలా రుచితో కొద్దిగా కారంగా ఉంటుంది. వేడి అన్నంలోకి నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకోవడం మర్చిపోవద్దు.
పెసరపప్పుతో గోరుచిక్కుడు కూర రుచిగా చేసుకోవచ్చు. ముందుగా గోరుచిక్కుడును చిన్న ముక్కలుగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఒక చేతి నిండా పెసరపప్పును బాగా కడిగి తరిగిన గోరుచిక్కుడుతో కలిపి కుక్కర్‌లో వేయాలి. గోరుచిక్కుడు ఉడికేంత మాత్రమే తేమ ఉంటే చాలు. అదనంగా నీళ్లు పోసే అవసరం లేదు. ఉడికించిన తర్వాత తాలింపు కోసం ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, కారం వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఉడికిన గోరుచిక్కుడు పెసరపప్పు మిశ్రమానికి వేసి బాగా కలిపితే రుచికరమైన గోరుచిక్కుడు పెసరపప్పు కూర రెడీ అవుతుంది.
కొబ్బరితో గోరుచిక్కుడు కూర రుచిగా చేయాలంటే ముందుగా గోరుచిక్కుడును చిన్న ముక్కలుగా తరిగి నీటిలో మెత్తగా ఉడకబెట్టాలి. పూర్తిగా ఉడికిన తర్వాత నీటిని వంపేసి గోరుచిక్కుడును పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉడికించిన గోరుచిక్కుడును దీనిలో వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు వేసి అన్ని పదార్థాలు కలిసేలా మృదువుగా వండాలి. నీరు పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత చివరగా కొబ్బరి తురుము వేసి 30 సెకన్ల పాటు తిప్పుతూ వేయించాలి. దీని ద్వారా కూరకు మంచి రుచితో పాటు కొబ్బరి తియ్యదనంతో అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.
చాలా పాత గోరుచిక్కుడు త్వరగా ఉడకదు, కాస్త గట్టిగా ఉంటుంది. అందుకే నీటిలో నానబెట్టి ఉడికించిన తర్వాత వాడితే మెత్తగా ఉంటుంది. చిన్నదిగా పెరిగిన గోరుచిక్కుడు కొంచెం చేదుగా ఉండొచ్చు ఆ రుచి నచ్చకపోతే వాడకపోవచ్చు. చాలా పాత గోరుచిక్కుడు అయితే దాని నార తీసేయాలి లేకపోతే అది మెత్తగా ఉడకదు. గోరుచిక్కుడులోని చేదు తగ్గాలంటే ఎక్కువ నీళ్లలో ముందుగా ఉడకబెట్టి ఆ నీటిని పారబోయడం మంచిది.




