
Mouth Ulcers
Mouth Ulcers: నోటి పూత అనేది సర్వసాధారణ సమస్య. సమస్యతో ఆరోగ్యానికి ప్రమాదం లేకపోయినప్పటికీ తినడానికి , తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కడుపులో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే మితిమీరిన మసాలా ఆహారం, కడుపు నొప్పి, మలబద్ధకం కారణంగా కూడా నోటి పూత తరచుగా సంభవిస్తుంది. కొన్ని సార్లు నోటి పుండ్లు హార్మోన్ల అసమతూల్యత, పీరియడ్స్ వంటి ఇతర కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే ఈ సమస్యను ఎలా నివారించాలో తెలుసా..? తెలుసుకుందాం..
- నోటి పూత సమస్యను నయం చేసేందుకు ఆహారంలో మార్పులు అవసరం. ఈ సమయంలో మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే కడుపులోని సమస్యలు దూరమవుతాయి. ఫలితంగా సమస్య దూరమై పోతుంది.
- చెంచా ధనియాల పొడిని నీటిలో వేసి మరిగించి తాగినా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. సమస్య ఉన్న సమయంలో రోజుకు 3 సార్లు ఇలా తాగితే చాలు.
- తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున ఇది కూడా నోటి అల్సర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కావాలంటే, తేనెను నేరుగా నోటి పుండ్లపై పూయవచ్చు.
- ఏలకుల పొడిని తేనెతో కలిపి అల్సర్ల మీద రాయడం ద్వారా కూడా తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఏలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున మీరు ఇలా రోజుకు రెండు సార్లు చేసినా సరిపోతుంది.
- మల్లె మొక్క ఆకులు కూడా నోటి పూత సమస్య నివారణలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందు కోసం మల్లె మొక్క ఆకుల రసాన్ని నోటి పుండ్లపై అప్లై చేస్తే సరిపోతుంది.
- నోటి పూత నివారణ కోసం వెన్నె లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. నోటి పుండ్లపై వెన్నె లేదా నెయ్యిని రోజులో 4 సార్లు రాస్తే సరిపోతుంది.
- కొబ్బరి నూనె కూడా నోటి పూత సమస్య నివారణకు చక్కని ఎంపిక. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, గాయాలను తగ్గించడంలో సహాయపడతాయి.
వీటితో పాటు నిత్యం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్ల నుంచి లభించే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అనేక సమస్యల నివారణలో కీలకంగా పనిచేస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)