ప్రస్తుతం కొంత మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పని చేస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొంత మందికి తమ డెస్క్ నుంచి లేవడానికి లేదా కాసేపు అటూ ఇటూ నడవడానికి కూడా సమయం దొరకదు. అయితే ఇలాంటి వ్యక్తుల ఆరోగ్యానికి కాలక్రమంలో హానికరంగా మారుతుంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీర చురుకుదనం తగ్గుతుంది. అంతేకాదు కండరాలు, ఎముకల బలహీనతకు దారితీస్తుంది. అలాగే ఊబకాయం, అనేక సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చొని ల్యాప్‌టాప్‌పై పని చేయడం వల్ల వెన్ను, మెడ, భుజాలపై నొప్పి వస్తుంది. పేలవమైన భంగిమ సమస్య కూడా ఏర్పడవచ్చు. అంతేకాదు ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యలను నివారించడానికి ఇటువంటి వారు రోజులో కొంత సమయం కేటాయించి యోగా చేయవచ్చు.
యోగా చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాల బలం మెరుగుపడుతుంది. ఎముకలు బలపడతాయి. అంతేకాదు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే యోగా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఈ సులభమైన యోగా ఆసనాలను చేయడం వలన అనేక ప్రయోజనాలుంటాయి.
తడసానాను పర్వత భంగిమ అని కూడా అంటారు. వెన్నెముకకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా శరీర భంగిమను మెరుగుపరచడంలో, అదనపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ యోగా ఆసనం చేయడానికి ముందుగా జాగ్రత్తగా నిటారుగా నిలబడండి. తర్వాత మీ రెండు చేతులను తలపైకి తీసుకుని, రెండు చేతుల వేళ్లను ఒక్కటిగా జత చేసి ఆ చేతులను నిటారుగా ఉంచాలి. దీని తరువాత కాళ్ల మడమలను ఎత్తండి. కాలి మీద నిలబడటానికి ప్రయత్నించండి.
భుజంగాసనాన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనంలో శరీరం పాములా తయారవుతుంది కనుక దీనిని భుజంగాసనం అంటారు. ఈ యోగా ఆసనం వెన్ను కండరాలను బలోపేతం చేయడంలో, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా మీ కడుపుపై యోగా చాప మీద పడుకోండి. అరికాళ్లను పైకి ఉంచాలి. ఇప్పుడు మీ చేతులను ఛాతీ దగ్గరకు తీసుకొని అరచేతులను క్రిందికి ఉంచండి. దీని తరువాత దీర్ఘ శ్వాస తీసుకోండి. నాభిని పైకి ఎత్తండి. తల.. మెడను పైకి ఎత్తండి. దీని తర్వాత నెమ్మదిగా ఛాతీ.. కడుపుని ఎత్తండి. మీరు ఆకాశం వైపు లేదా పైకప్పు వైపు చూస్తున్నట్లు 5 నుండి 10 సెకన్ల వరకు ఈ భంగిమలో ఉండాలి.
వజ్రాసనం ఉదర అవయవాల పని తీరుని మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థకు మంచిది. ఈ ఆసనం వేయడానికి మీ మోకాళ్ళను వంచి, మీ కాలి వేళ్ళపై కూర్చోండి .. రెండు పాదాల కాలి వేళ్ళను కలపండి. మడమల మధ్య కొంత దూరం ఉండాలని గుర్తుంచుకోండి. శరీరం మొత్తం బరువును పాదాలపై ఉంచండి .. రెండు చేతులను తొడలపై ఉంచండి.. ఈ సమయంలో నడుము పైన భాగం ఖచ్చితంగా నిటారుగా ఉండాలని గుర్తుంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Note: పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.